అమ్మో.. మళ్లీ వర్షం!

ABN , First Publish Date - 2021-12-10T04:42:07+05:30 IST

జిల్లాలో గురువారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో వాగులు, వంకలు ఉప్పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అమ్మో.. మళ్లీ వర్షం!
చేజర్ల : టీకేపాడు సమీపంలో పొంగి ప్రవహిసున్న్త నల్లవాగు

జిల్లావాసుల్లో వణుకు


నెల్లూరు(హరనాథపురం)/చేజర్ల, డిసెంబరు 9 : జిల్లాలో గురువారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో  వాగులు, వంకలు ఉప్పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా గురువారం జిల్లా సరాసరి వర్షపాతం 10.7 మిమీగా నమోదవగా అత్యధికంగా మర్రిపాడులో 60.9, అత్యల్పంగా గూడూరులో 0.4మిమీ వర్షం కురిసింది. ఇప్పుడిప్పుడే వర్షాల నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నిండు కుండలా ఉన్న  చెరువులు ఎక్కడ తెగుతాయేనని భయబ్రాంతులకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున చేజర్ల మండలంలో 55.4 మి.మీ వర్షం కురిసింది. గొల్లపల్లి సమీపంలోని పందలవాగు పొంగి ప్రవహిస్తుండడంతో సంగం-చేజర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా టీకే పాడు సమీపంలోని నల్లవాగు పొంగడంతో కాకివాయి, యనమదల, బిల్లుపాడు. టీకే పాడు, కోటితీర్థం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా, నెల్లూరు నగరంతోపాటు ఉదయగిరి, వెంకటగిరి, కావలి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, రాపూరు, నాయుడుపేట, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 

ఆత్మకూరు : పట్టణ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆత్మకూరు చెరువుకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పట్టణంలోని బీఎ్‌సఆర్‌ ఆసుపత్రి వెనుక ఓ విద్యుత స్తంభం ట్రాన్సఫార్మర్‌పై పడిపోవడంతో మంటలు చెలరేగాయి. రాత్రివేళ కావడంతో జనసంచారం లేనందున త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.  విద్యుత శాఖ ఏఈ చంద్రన, లైనమెన్లు అక్కడకు చేరుకుని మరమ్మతులు చేసి విద్యుత సరఫరాను పునరుద్ధరించారు.


‘సోమశిల’లో 75 టీఎంసీల నీరు


అనంతసాగరం : సోమశిల జలశయానికి గురువారం 18,680 క్యూసెక్కుల ఇనఫ్లో నమోదైంది. డ్యాంలో 75.122 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కాలువకు 400, వరద కాలువకు 120, పెన్నానదికి 2,100 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


కొమ్మలేరువాగుపై అవస్ధలు


మండలంలోని కొత్తపల్లి వద్ద కొమ్మలేరువాగుపై బ్రిడ్జి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వర్షం కురవడంతో వాగు వద్ద ప్రవాహం అధికమైంది. దీంతో కచ్చేరిదేవరాయల్లి, వెంగమ్మనాయుడుపల్లి గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. 




Updated Date - 2021-12-10T04:42:07+05:30 IST