వైభవంగా పోలేరమ్మ తిరుణాళ్లు

ABN , First Publish Date - 2021-01-13T03:43:21+05:30 IST

అల్లూరు పోలేరమ్మ తిరుణాళ్లు మంగళవారం వైభవంగా జరిగాయి. పోలేరమ్మకు ఉదయం లభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా పోలేరమ్మ తిరుణాళ్లు
అమ్మవారి సన్నిధిలో మంత్రి అనిల్‌కుమార్‌, ఎమ్మెల్యే రామిరెడ్డి, బీద తదితరులు

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అనిల్‌, ఎమ్మెల్యేలు 

అల్లూరు, జనవరి 12: అల్లూరు పోలేరమ్మ తిరుణాళ్లు మంగళవారం వైభవంగా జరిగాయి. పోలేరమ్మకు ఉదయం లభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ ప్రతిష్ఠ అనంతరం అమ్మవారిని బంగారు చీర, బంగారు ఆభరణములతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. చల్ది నైవేద్య కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు తలపై చల్ది కుండలను పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పోతురాజుకు నైవేద్యం సమర్పించారు. మధ్యాహ్నం బైనాడి వారిచే కథాకాలక్షేపం, సాయంత్రం చలిపిండి పానకాలు, కుంభం కార్యక్రమంలో గ్రామస్థులు పొంగళ్లు పొగించి నైవేద్యంగా సమర్పించారు. ఆలయానికి పూల అలంకరణ, విద్యుత్‌ దీపాలంకరణ ఆకట్టుకుంది. అమ్మవారి సన్నిధిలో సాయంత్రం మంగళవాయిద్యాలు, ఆచారం తప్పెట్లతో కోలాటాలు, గంగపెట్టి, వీరతాళ్లు, డి.జె.సౌండ్స్‌ బాణాసంచాతో అత్యంత వైభవంగా గ్రమోత్సవం నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత రథంపై అలంకరింపజేసిన అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. పోలేరమ్మను రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కావలి ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి దర్శించుకున్నారు. 


ఒక నియోజకవర్గం.. రెండు పోలీస్‌ చట్టాలు


కావలి, జనవరి 12 : ఒక నియోజకవర్గం.. రెండు పోలీస్‌ చట్టాలు... ఏంటి ఆశ్చర్యంగా ఉందా!? నిజమండీ. కావలి, అల్లూరు ప్రాంతాలలో గ్రామదేవతల ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఒకచోట అనుమతి ఇచ్చిన పోలీసులు మరోచోట నిరాకరించారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు నెల్లూరు రూరల్‌ పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ఉండగా, కావలి కలుగోళ్ల శాంభవి ఆలయం కావలి సబ్‌డివిజన్‌ పోలీస్‌ పరిధిలో ఉంది. కొవిడ్‌-19 నిబంధనలు, పోలీస్‌ చట్టాలు ఒక్కటే అయినా వాటిని అమలు చేసే పోలీస్‌ అధికారులు వేరుకావడంతో ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. పోలేరమ్మ ఉత్సవాలను కావలి ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డిలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెలే బీద మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అడ్డుచెప్పే ధైర్యం పోలీసులకు లేకపోయింది. అయితే, కావలిలో కలుగోళ్ల శాంభవి ఉత్సవాలలో సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు పోలీసులు ‘నో’ చెప్పేశారు.


Updated Date - 2021-01-13T03:43:21+05:30 IST