అధికార పార్టీలో రె‘బెల్స్’!
ABN , First Publish Date - 2021-02-07T04:59:16+05:30 IST
జిల్లా పరిధిలోని మిగిలిన రెవెన్యూ డివిజన్లకు, కావలి డివిజన్‌కు చాలా వ్యత్యాసం ఉంది.

నేతల మాటలకు బేఖాతర్
తాడోపేడో తేల్చుకునేందుకు బరిలోకి...
ఏకగ్రీవాలకు కలిసిరాని కాలం
కావలి డివిజన్‌లో గతానికి భిన్నంగా..
బలంగా మోటుకొంటున్న ప్రతిపక్షాలు.. రెబల్స్ అభ్యర్థులు
పల్లెపోరులో అధికార పార్టీ ఆశలకు అడ్డుకట్ట పడుతోందా!? ఆ పార్టీ నేతల మాటలకు పల్లెల్లో విలువ లేకుండా పోతోందా!? ఆశించిన రీతిలో కుదరని ఏకగ్రీవాలు, చివరికి సొంత పార్టీ వారే మాట వినము పొమ్మనే పరిస్థితులు గమనిస్తే స్థానికంలో అధికార పార్టీకి చుక్కెదురు అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది మార్చికి.. ప్రస్తుత పరిస్థితికి పల్లెల్లో.. ప్రతిపక్షాల్లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రచార ఘట్టం మొదలైన కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో పరిస్థితులు విశ్లేషిస్తే అధికార పార్టీకి చుక్కెదురవుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది.
నెల్లూరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని మిగిలిన రెవెన్యూ డివిజన్లకు, కావలి డివిజన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. జిల్లాలో ఎక్కడా కనిపించని వర్గ రాజకీయాలు ఇక్కడ నెలకొన్నాయి. చాలా పల్లెలో ఫ్యాక్షన్ చాయలు కనిపిస్తాయి. పల్లెలకు పల్లెలు ఏదో ఒక పార్టీకో, వర్గానికో బలమైన మద్దతుగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావలి డివిజన్ పరిధిలో ఏకగ్రీవాలు ఎక్కువగా రికార్డు కావడం సహజం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ మాటల ప్రకారం గత ఎన్నికల్లో ఈ డివిజన్‌లో 20 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఈసారి కేవలం 13 శాతం పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. కావలి నియోజకవర్గం విషయానికి వస్తే అధికార పార్టీ అంచనాలు తల్లకిందులైనట్లే కనిపిస్తోంది. ఇక్కడ కేవలం మూడు పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం కావడం విశేషం. ఈ పరిస్థితులు గమనిస్తే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, బీజేపీలు ఇక్కడ బలమైన పోటీ ఇస్తున్నాయి. ఒక్క కావలిలోనే కాదు... జిల్లాలో ఏ రెవెన్యూ డివిజన్ పరిధిలోనూ ఏకగ్రీవాల సంఖ్య పెరిగే సూచనలు కనిపించడం లేదు. రెండో విడతగా ఎన్నికలు జరగనున్న ఆత్మకూరు డివిజన్‌లో, మూడు, నాలుగు ఫేజ్‌లో ఎన్నికలు జరగబోయే గూడూరు, నాయుడుపేట, నెల్లూరు డివిజన్లలో సైతం ఏదో ఒక పార్టీకి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికి ఎన్నికల కమిషన్ పనితీరు, ప్రతిపక్షాల పోరాట పఠిమలు దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
నేతల మాటలు బేఖాతర్
ఎక్కడ మామా అన్నా.. వంగ తోట కాడ కుదరదు అన్న సామెత చందంగా సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్న, చేయాలని నిర్ణయించుకున్న ఆశావహులు అధికార పార్టీ నాయకుల మాటలను అస్సలు ఖాతరు చేయడం లేదు. ఎంత బుజ్జగించినా, బెదిరించినా పోటీకి సై అంటున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ముఖ్య నాయకులు ఎవరు చెబితే వాళ్లే అభ్యర్థి. ఆ పార్టీలో మరొకరు పోటీ చేయడానికి, తిరుగుబాటు చేయడానికి వీల్లేదు. అఽధికార పార్టీ పవర్ అలాంటిది. అయితే ఇప్పుడు ఆ సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ అయితే ఏ పార్టీ అయినా తనవద్దకు రావాల్సిందే కదా అనే ధీమా పోటీదారుల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో పలు చోట్ల అధికార నాయకులు హెచ్చరించినా, బెదిరించినా, బుజ్జగించినా లెక్కచేయకుండా ఆ పార్టీకి చెందినవారే రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. కలికిరి మండలంలో 21 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సుమారు 15 పంచాయతీల్లో ఒకేపార్టీకి చెందిన రెండు వర్గాలు పోటీ చేస్తున్నట్లు సమాచారం. జలదంకిలో 13 పంచాయతీలలో తొమ్మిదింట రెబల్స్ ఉన్నారు. ఇలా డివిజన్ పరిధిలోని ప్రతి మండలం పరిధిలో కనిష్ఠంగా మూడు, నాలుగు పంచాయతీల్లో అధికార పార్టీకి రెబల్స్ బెడద ఉన్నట్లు కనిపిస్తోంది. నాయకుల మాటలను లెక్కచేయకుండా, స్వశక్తిపై నమ్మకంతో పలువురు ఎన్నికల్లో పోటీకి తలపడుతున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపించడం లేదు. ఒక్కో పంచాయతీకి అధికార పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. గట్టిగా దబాయిస్తే ఎక్కడ శాశ్వత శత్రుత్వం ఏర్పడుతుందో, ఆ ప్రభావం రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన నాయకులను వెన్నాడుతోంది. జరిగేవి పార్టీ రహిత ఎన్నికలే కదా, గెలిచిన కోడి నాది అంటే సరిపోతుందని చాలా మంది మౌనంగా వేడుక చూస్తున్నారు.