దూసుకొచ్చిన మృత్యువు!

ABN , First Publish Date - 2021-02-27T04:43:05+05:30 IST

మరో ఐదు నిమిషాల్లో కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన ఓ ఆటో డ్రైవర్‌ ప్రాణం బస్సు కింద నలిగిపోయింది.

దూసుకొచ్చిన మృత్యువు!
ఆటోపైకి దూసుకెళ్ళిన ఆర్టీసీ బస్సు

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

యువకుడి మృతి 


బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 26 : మరో ఐదు నిమిషాల్లో కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన ఓ ఆటో డ్రైవర్‌ ప్రాణం బస్సు కింద నలిగిపోయింది. శుక్రవారం సాయంత్రం బుచ్చిమండలం రేబాల సమీపంలో జాతీయ రహదారిపై ఓ ఆటోపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆటో డ్రైవర్‌ మృతి చెందగా, మృతుడి బంధువుల ఆర్తనాదాలు అందరినీ కలచివేశాయి. వివరాల్లోకి వెళితే.. రేబాలకు ప్రగతి నగర్‌ కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన అత్తిపాటి రఘురామయ్య కొడుకు అత్తిపాటి సురేష్‌ (30) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రేబాల సెంటర్‌లో టీ తాగి ఆటోలో ఇంటికి బయలుదేరాడు. ఆ కొద్దిసేపటికే నెల్లూరు నుంచి ఉదయగిరికి వెళుతున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. దీంతో ఆటో డ్రైవరు సురేష్‌ బస్సు కింద ఇరుక్కుపోయాడు. 


స్పందించిన కలిగిరి సీఐ


తమ ఎదుటే బస్సు ఆటోపై దూసుకెళ్లడంతో స్థానికులందరూ హతాశయులయ్యారు. అదే సమయానికి నెల్లూరు నుంచి  వెళ్తున్న  కలిగిరి సీఐ శ్రీనివాసరావు  వెంటనే సహాయక చర్యలు చేపట్టి బుచ్చి సీఐ సురే్‌షబాబు, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డిలకు సమాచారం అందజేశారు. బస్సు కింద నుంచి ఆటోను వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు. చివరకు ఓ ట్రాక్టర్‌ క్రేన్‌ సాయంతో ఆటోతోపాటు డ్రైవర్‌ సురేష్‌ మృతదేహాన్ని  వెలికితీశారు. ఆర్టీసీ డ్రైవర్‌ గోపాలకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో సుమారు ఒకటిన్నర గంటపాటు నెల్లూరు-ముంబయి జాతీయరహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


మిన్నంటిన ఆర్తనాదాలు


ప్రమాద విషయం తెలుసుకున్న మృతుడి భార్య జ్యోతి, బంధువులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సురేష్‌ మృతదేహాన్ని చూసి అంతా గుండెలవిసేలా విలపించారు. కాగా ఆర్నెల్ల క్రితమే సురేష్‌ కుమార్తె వరలక్ష్మి డెంగ్యూతో మృతి చెందింది. ఇప్పుడు తండ్రి మృత్యువాత పడటంతో ప్రగతినగర్‌ కాలనీలో విషాదం అలుముకుంది.

Updated Date - 2021-02-27T04:43:05+05:30 IST