2వ రోజు.. 2 నామినేషన్లు

ABN , First Publish Date - 2021-03-25T04:48:36+05:30 IST

తిరుపతి ఉప పోరులో రెండవ రోజు బుధవారం రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

2వ రోజు.. 2 నామినేషన్లు

అట్టహాసంగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్‌

భారీగా తరలివచ్చిన రాష్ట్ర నేతలు, పార్టీ శ్రేణులు.

తిరుపతిలో వైసీపీ సమావేశం.. 29న నామినేషన్‌ 

ఇంకా కొలిక్కిరాని బీజేపీ అభ్యర్థి!?


నెల్లూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి ఉప పోరులో రెండవ రోజు బుధవారం రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, స్వతంత్ర అభ్యర్థిగా శీలం తిరుపతయ్య బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అధికార వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్‌ దాఖలుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరో ఖరారు కాకున్నా పార్టీ అజెండానే ప్రచార అస్త్రంగా చేసుకొని కమలదళం ప్రచారంలోకి దిగింది. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నాయుడుపేట మండలంలో ప్రచారం చేశారు. ఇవి బుధవారం నాటి ఉప ఎన్నికల ప్రధాన విశేషాలు. 


అట్టహాసంగా పనబాక నామినేషన్‌


తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్‌ నాయకుల మధ్య కేంద్ర మాజీ మంత్రి  పనబాక లక్ష్మి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో నగరం కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత తిరుపతి పార్లమెంట్‌ నియోకవర్గానికి ఈశాన్య దిక్కు అయిన టీపీ గూడూరు నుంచి బుధవారం సాయంత్రం ఆమె ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 


29న వైసీపీ నామినేషన్‌


వైసీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్‌ దాఖలుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బుధవారం తిరుపతిలో  పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, అభ్యర్థి గురుమూర్తి తదితరులు సమావేశమయ్యారు. ఈ నెల 29వ తేదీన  గురుమూర్తి నెల్లూరులో నామినేషన్‌ వేయనున్నారు. ఈ సమావేశంలో ప్రచారానికి సంబంధించిన టైం టేబుల్‌ కూడా నిర్ణయించుకున్నారు. నామినేషన్‌ తరువాత అభ్యర్థి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజులు ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్‌ చేసుకున్నారు. మిగిలిన రోజులు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. బుధవారం తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌లు హాజరయ్యారు. 


బీజేపీలో ఇంకా సస్పెన్స్‌


బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు, మునిసుబ్రహ్మణ్యం, సత్యవతి తదితరులు రేస్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అభ్యర్థి ఎవరన్న విషయంలో ఢిల్లీ పెద్దల నుంచి పార్టీ నేతలకు స్పష్టత రాలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిలు బుధవారం నాయుడుపేటలో ప్రచారరం నిర్వహించారు. 

Updated Date - 2021-03-25T04:48:36+05:30 IST