25 ఏళ్లు 28 అరెస్టులు

ABN , First Publish Date - 2021-05-19T04:44:19+05:30 IST

అతని వయస్సు 25 ఏళ్లు... ఎన్నో చోట్ల చోరీలకు పాల్పడి ఘరానా దొంగగా రికార్డులకెక్కాడు. ఇప్పటికే 28 సార్లు పోలీసులకు చిక్కాడు.

25 ఏళ్లు  28 అరెస్టులు
నిందితుడి వివరాలు తెలుపుతున్న ఎస్పీ భాస్కర్‌భూషణ్‌

అయినా మారని తీరు

ఘరానా దొంగను పట్టుకున్న పోలీసులు

రూ.11లక్షల బంగారు, నగదు స్వాధీనం


నెల్లూరు (క్రైం), మే 18 : అతని వయస్సు 25 ఏళ్లు... ఎన్నో చోట్ల చోరీలకు పాల్పడి ఘరానా దొంగగా రికార్డులకెక్కాడు. ఇప్పటికే 28 సార్లు పోలీసులకు చిక్కాడు. తాజాగా మరోసారి పోలీసులు ఆ చోరాగ్రేసరుడిని అరెస్టు చేశారు. ఆ వివరాలను మంగళవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర సమావేశమందిరంలో ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ విలేకరులకు వెల్లడించారు. కలువాయి మండలం వీరుబొట్లపల్లికి చెందిన గోగుల శివయ్య 16 సంవత్సరాల వయసులోనే చెడు అలవాట్లకు బానిసయ్యాడు. విలాస వంతమైన జీవితాన్ని గడిపేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. తొలుత నెల్లూరులోని ఒక అంగడిని పగులకొట్టాడు. ఆ కేసులో పోలీసులకు చిక్కిన శివయ్యను తిరుపతిలోని జువెనైల్‌ హోంకు తరలించారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.  రాత్రుళ్లు తిరుగుతూ తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా నేరాలకు పాల్పడ్డాడు. పలు కేసుల్లో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. కలువాయి పోలీస్‌ స్టేషనలో షీట్‌ ఓపెన చేశారు. అయితే ఎన్ని సార్లు జైలుకు వెళ్లివచ్చినా శివయ్య అదేతీరును కొనసాగిస్తూ వచ్చాడు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా చోరీలు జరుగుతుండటంతో వెంకటగిరి ఇనస్పెక్టర్‌ ఎన నాగమల్లేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఓ బృందాన్ని ఏర్పాటు చేసి నేరస్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఆర్ధరాత్రి రాపూరు పోలీస్‌ స్టేషన పరిధిలోని మద్దెలమడుగు జంక్షన వద్ద శివయ్యను అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రాపూరు, డక్కిలి, చేజర్ల, మనుబోలు, సంగం పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని 8 కేసుల్లో రూ.11 లక్షలు విలువ చేసే 240 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘరానా దొంగను పట్టుకున్న వెంకటగిరి సర్కిల్‌ క్రైం టీమ్‌ సభ్యులు, సీఐ నాగమల్లేశ్వరరావు, రాపూరు ఎస్‌ఐ ఎన క్రాంతికుమార్‌, బాలాయపల్లి హెడ్‌కానిస్టేబుల్‌ బీ మధుసూదనరావు, డక్కిలి కానిస్టేబుళ్లు ఎం పవనకుమార్‌, టీ లక్ష్మీకాంత, రాపూరు కానిస్టేబుల్‌ వీ మురళి, హోంగార్డు ఎస్‌డీ అబిద్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వెంకటరత్నం, గూడూరు డీఎస్పీ రాజేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T04:44:19+05:30 IST