214 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ABN , First Publish Date - 2021-02-06T05:12:23+05:30 IST

జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు 214 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు.

214 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ హరేందిర ప్రసాద్‌

రైతులు ఆర్‌బీకేలకు వెళితే చాలు

గ్రేడ్‌ - ఏ ధాన్యం పుట్టి మద్దతు ధర రూ.16,048

జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌


నెల్లూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు 214 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు. జిల్లాలో 5.30 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో  విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. ఇప్పటికే నాయుడుపేట డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయని, అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా యని చెప్పారు. రైతులు ధాన్యం విక్రయాలకు రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)కు వెళితే చాలని, అక్కడ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక కొనుగోలు తేదీతో కూడిన కూపన్‌ ఇస్తారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాల సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు. నిబంధనలు అనుసరించి దెబ్బతిన్న, రంగు మారిన పంటను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హరేందిర ప్రసాద్‌ తెలిపారు. దళారులను నమ్మవద్దని, మిల్లుల వద్దకు కూడా నేరుగా ధాన్యం తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది కనీస మద్దతు ధర పెరిగిందని, ఏ గ్రేడు ధాన్యం పుట్టిని రూ16,048కు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలానే సాధారణ రకం ధాన్యం పుట్టికి రూ.15,878 మద్దతు ధర నిర్ణయించినట్లు జేసీ చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేసిన రైతుల ధాన్యాన్ని మాత్రమే ఆర్‌బీకేల్లో కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సివిల్‌ సప్లయిస్‌ డీఎం రోజ్‌మాండ్‌, డీఎస్‌వో బాలకృష్ణారావు పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-06T05:12:23+05:30 IST