వైసీపీ అరాచకం

ABN , First Publish Date - 2021-10-20T05:51:52+05:30 IST

నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసేందుకు యత్నించారు.

వైసీపీ అరాచకం
టీడీపీ కార్యాలయం వద్దకు చంద్రబాబు దిష్టిబొమ్మతో వెళ్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు

  1. టీడీపీ కార్యాలయంపై దాడి యత్నం 
  2. వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  3. కర్నూలు నగరంలో ఉద్రిక్తత


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 19: నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసేందుకు యత్నించారు. దీంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని దుర్భాషలాడారంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు చంద్రబాబు దిష్టిబొమ్మతో భారీగా తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు వైసీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. కేసీ కెనాల్‌ బ్రిడ్జి సమీపంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి రాకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. గంటపాటు పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసు అధికారులు వైసీపీ నాయకులు, కార్యకర్తలను సముదాయించి వెనక్కి పంపించేశారు. ఈ ఘటనతో ప్రధాన రహదారిపై గంటసేపు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ అయింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పరిసర ప్రాంతంలోని ప్రజలు భయం గుప్పిట్లో గడిపారు. పోలీసులు టీడీపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 


 టీడీపీ కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, నాగేంద్ర కుమార్‌ వైసీపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఇలా చెలరేగిపోవడం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌దేనని వారు స్పష్టం చేశారు. ఏదైనా విషయాన్ని శాంతియుత నిరసనల ద్వారా లేదా పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని, ఈ విధంగా ప్రత్యక్ష దాడులకు పూనుకోవడం మంచి పద్ధతి కాదని వారు పేర్కొన్నారు.


తాలిబన్ల పాలనకంటే ఘోరం


  1. మాజీ మంత్రులు ఫరూక్‌, ఏరాసు


నంద్యాల టౌన్‌, అక్టోబరు 19: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలనకంటే ఘోరంగా ఏపీలో వైసీపీ అరాచక పాలన సాగిస్తున్నదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై దాడి, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వైసీపీ గూండాల దాడులు వారి దౌర్జన్యపాలనకు అద్దం పడుతున్నాయన్నారు. మంగళవారం రాత్రి నంద్యాల రాజ్‌థియేటర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఫరూక్‌, ఏరాసు మాట్లాడారు. పాలన చేతకాక, ప్రతిపక్షాలు ప్రశ్నించే అంశాలకు సమాధానాలు చెప్పలేక వైసీపీ ముఠాలు దాడులకు తెగబడుతున్నాయని ధ్వజమెత్తారు. పట్టాభి ఇంటిపై దాడిచేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. డీజీపీ కార్యాలయానికి కేవలం వందమీటర్ల దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దౌర్జన్యకారులు దాడులకు పాల్పడటం శోచనీయమన్నారు. ఇందుకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిదేనని అన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటికెళ్లి పోలీసులు గంజాయిపై ఆధారాలు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అనుసరిస్తున్న తీరును ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రజలపై పన్నుల భారం, అవినీతిని ప్రభుత్వాలను ఎత్తిచూపే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష హోదాలో జగన్‌, ఇతర నేతలు ఎన్నిసార్లు ప్రశ్నించారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఫరూక్‌, ఏరాసు పేర్కొన్నారు. సమావేశంలో నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.


విమర్శిస్తే దాడులా?


  1. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  2. టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి


కర్నూలు (అగ్రికల్చర్‌): వైసీపీ అరాచక పాలనపై ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే దాడులకు పాల్పడుతారా? అని కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయాలు, నాయకులపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం, తమ నేతలను దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండించారు. దాదాపు గంటసేపు నగర ప్రజలు ఈ విధ్వంసానికి భయాందోళనలు చెందారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు, పత్రికల ద్వారా అభిప్రాయాలను ప్రజలకు తెలియజెప్పాలే కానీ, ఇలా విధ్వంసానికి దిగడం ఎంతమాత్రం క్షమార్హం కాదన్నారు. తమ నేత చంద్రబాబు నాయుడు మూడుసార్లు సీఎంగా ఉన్నారని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఏనాడు సంయమనం కోల్పోలేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి, అక్రమ మద్యం రవాణాకు ప్రభుత్వ చేతకానితనమే నిదర్శనమని తమ నేతలు విమర్శించారని, దీనికి విధ్వంసానికి పూనుకోవడం దారుణమని అన్నారు. పట్టాభి ఇంటిపై కూడా దాడికి తెగబడ్డారని, ఇంట్లోని మహిళలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారని అన్నారు. ప్రస్తుత ఘటనలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్ర కుమార్‌, పోతురాజు రవికుమార్‌ పాల్గొన్నారు. కాగా ఈ ఘటనపై టీడీపీ నేతలు వై. నాగేశ్వరరావు యాదవ్‌, ఈ.సుకన్యాదేవీ, అబ్బాస్‌, జేమ్స్‌, హనుమంతరావు చౌదరి వేరువేరు ప్రకటనల్లో స్పందించారు. దాడి చేసిన వైసీపీ నాయకులపై ఎస్పీ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు 


  1. సీఎం జగన్‌పై టీడీపీ నాయకుల ధ్వజం 
  2. కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 19: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి రెండున్నర సంవత్సరాలుగా సాగిస్తున్న అరాచక పాలన మంగళవారం పరాకాష్టకు చేరిందని తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఇన్‌చార్జి గౌరు చరిత, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు. వైసీపీ నాయకుల విధ్వంసకాండపై మంగళవారం రాత్రి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల గృహాలపై వైసీపీ నాయకులు రాక్షసుల్లా దాడి చేశారని, పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి పరిపాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగే రాష్ట్ర బంద్‌, నిరసన కార్యక్రమానికి జిల్లా ప్రజలంతా సహకరించాలని కోరారు.Updated Date - 2021-10-20T05:51:52+05:30 IST