మా నిధులు వెనక్కిచ్చేయండి
ABN , First Publish Date - 2021-11-26T05:42:31+05:30 IST
గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ సర్పంచులు ఆందోళనకు దిగారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.

- పంచాయతీ సర్పంచ్‌ల డిమాండ్
- కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన
- ఆర్థిక సంఘం నిధుల పక్కదారిపై ఆగ్రహం
కర్నూలు(కలెక్టరేట్), నవంబరు 25: గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ సర్పంచులు ఆందోళనకు దిగారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద గురువారం బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు రూ.3,500 కోట్ల నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీంతో సర్పంచులు అవాక్కయ్యారు. గ్రామాలకు కేటాయించిన నిధులను తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని నినదించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల సంఘం గురువారం కలెక్టరేట్ ఎదురుగా నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఓర్వకల్లు మండలం గుట్టపాడు సర్పంచ్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని 13 వేల గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా జనాభా ప్రాతిపదిక దాదాపు రూ.3,500 కోట్ల నిధులను కేటాయించిందని అన్నారు. ఈ నిధులను గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం మొదలగు వాటిని ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పంచాయతీల తీర్మాణంలో నిమిత్తం లేకుండా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎందుకు తీసుకున్నారో కూడా సమాచారం ఇవ్వడం లేదని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆయన తప్పుబట్టారు. గ్రామ పంచాయతీ నిధులను వెంటనే జమ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులతో కలిసి ఆందోళన చేస్తామని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపడుామని అన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచులు లెనిన్‌బాబు, భాగ్యమ్మ, కె.హరితరెడ్డి, టి.ఎల్లయ్య, ఎం.మాధవ స్వామి, ఉదయ్ కుమార్, మంజుల, సరోజమ్మ, అయ్యస్వామి, రాధా, జె.రామ్మోహన్, షహానా, జయశ్రీ, మహేష్, వీరేష్, రామాంజినేయులు, బోయ లావణ్య, ఈశ్వరయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.