మైనార్టీలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు?

ABN , First Publish Date - 2021-12-30T05:49:37+05:30 IST

రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం ఇంకా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నదని, కానీ ముస్లింలు నమ్మేస్థితిలో లేరని కడప టీడీపీ సమన్వయకర్త అమీర్‌బాబు ధ్వజమెత్తారు.

మైనార్టీలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు?

  1. టీడీపీ కడప సమన్వయకర్త అమీర్‌బాబు 


నంద్యాల టౌన్‌, డిసెంబరు 29: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం ఇంకా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నదని, కానీ ముస్లింలు నమ్మేస్థితిలో లేరని కడప టీడీపీ సమన్వయకర్త అమీర్‌బాబు ధ్వజమెత్తారు. బుధవారం నంద్యాల మదరసా అరబియా దారుల్‌ అమన్‌ను రక్షించండి-అవినీతి అధికారులను శిక్షించండి అనే నినాదంతో టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్షకు మద్దతు తెలపడానికి కడప టీడీపీ నేత అమీర్‌బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు నంద్యాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కనుమరుగు చేసిందని విమర్శించారు. మైనార్టీ సంక్షేమానికి రూ.వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం, ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేసిందీ, ఎవరికి లబ్ధి కలిగింది  శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులు దర్జాగా కబ్జా చేసి అనుభవిస్తున్న బడాబాబుల జోలికి వెళ్లని ప్రభుత్వం, మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు వక్ఫ్‌ భూమిని లీజుకు తీసుకొని మదరసా నడుపుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ మదరసాను సీజ్‌ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా కన్వీనర్‌ మస్తాన్‌వలి, పీడీఎ్‌సయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ఎండీ రఫీ, ఆవాజ్‌ పట్టణ అధ్యక్షుడు బాబుల్లా, పలువురు ముస్లిం ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. Updated Date - 2021-12-30T05:49:37+05:30 IST