వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్ భూములే ఎందుకు?
ABN , First Publish Date - 2021-10-22T05:22:56+05:30 IST
నంద్యాలలో కొత్తగా ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాలకు వ్యవసాయ పరిశోధనా భూములే ఎందుకు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు.

- మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి
నంద్యాల, అక్టోబరు 21: నంద్యాలలో కొత్తగా ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాలకు వ్యవసాయ పరిశోధనా భూములే ఎందుకు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం భూ సేకరణ నిమిత్తం సీఎం జగన్ నిధులు కేటాయిస్తుంటే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఎందుకు నంద్యాల వైద్య కళాశాల భూ సేకరణకు నిధులు మంజూరు చేయించడంలో చేతులెత్తేశారని ప్రశ్నించారు. ఆదోని వైద్య కళాశాలకు ప్రభుత్వం రూ.23కోట్లు భూ సేకరణకే కేటాయించిందని, నంద్యాలలో మాత్రం ఆర్‌ఏఆర్‌ఎస్ భూములపైనే దృష్టి కేంద్రీకరిండంలో ఉన్న మతలబు ఏమిటని అన్నారు. ప్రభుత్వ భూమి 50 ఎకరాలుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని, అయితే తాను సవాళ్లకు ప్రతిసవాల్ విసరడంలేదని, నంద్యాల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నామని అన్నారు. భీమవరం గ్రామ పరిధిలో 50 ఎకరాల భూమి ఉందని, సర్వే నెంబర్లతో సహా భూమా వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోడల్ స్కూల్ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని తీసుకున్నామని, కానీ అప్పటి విద్యాశాఖ అధికారులు సెరికల్చర్ కార్యాలయంలో తాత్కాలికంగా మోడల్ పాఠశాల నడుస్తున్నదని చెప్పా రన్నారు. అభివృద్ధిలో పోటీపడాలే కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయ డం తగదని అన్నారు. ఈసమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ మాబువలి, మాజీ కౌన్సిలర్లు కొండారెడ్డి, శివశంకర్ పాల్గొన్నారు.