కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం ఏంటి?

ABN , First Publish Date - 2021-07-24T06:07:16+05:30 IST

కృష్ణా జలాలపై కేంద్రం పెత్త నం ఏమిటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రశ్నించారు.

కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం ఏంటి?

  1. జగన్‌, కేసీఆర్‌ లాలూచీతో తీవ్ర అన్యాయం
  2. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
  3. కర్నూలులో ఆరు జిల్లాల టీడీపీ నాయకుల సమావేశం


కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 23: కృష్ణా జలాలపై కేంద్రం పెత్త నం ఏమిటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయలసీమలోని నీటి ప్రాజెక్టుల మనుగడపై చర్చించేందుకు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు నగరంలోని మౌర్య ఇన్‌లో పరిణయ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశమయ్యారు. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సారథ్యం వహించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, అమర్‌నాథ్‌ రెడ్డి, పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, నంద్యాల టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, టీడీపీ రైతు విభాగం నాయకుడు రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, నాగేంద్ర కుమార్‌ పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సొంత ప్రయోజనాల కోసం లాలూచీ పడి రగిల్చిన వివాదాల మధ్య రాయలసీమ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి దాపురించిందన్నారు. కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులపై బచావత్‌ ట్రిబ్యునల్‌ ఏపీకి కల్పించిన హక్కుల్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. మిగులు జలాలపై ఏపీ హక్కుల్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమన్నారు. పెన్నా బేసిన్‌లోని ప్రాజెక్టులపై కేంద్రం ఎలా నోటిఫికేషన్‌ ఇస్తుందని సోమిరెడ్డి ప్రశ్నించారు. మిగులు జలాల ఆధారంగా సీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల మనుగడ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల అగమ్యగోచరంగా తయారైందన్నారు. 2015లో ఉమ్మడి ఒప్పందానికి విరుద్ధంగా, కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌కు పూర్తి వ్యతిరేకంగా ప్రస్తుతం కేం ద్రం నోటిఫికేషన్‌ విడుదల చేయడం దారుణమన్నారు. 2016లో రూపొందించిన డ్రాఫ్టు నోటిఫికేషన్‌లో 14 ప్రాజెక్టులకే పరిమితం చేశారని, ప్రస్తుతం కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలోకి చాలా ప్రాజెక్టులను చేర్చడం వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనికి బాఽధ్యుడు సీఎం జగనే అవుతారని ఆరోపించారు. అనంతపురానికి చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ గొంతు కోసే ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించడం బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన హక్కుల్ని తాకట్టు పెట్టడమేనని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే బ్రిజెష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అక్టోబరు 14 నుంచి 107 ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ బోర్డు చేతుల్లోకి వెళ్తాయని అన్నారు. రెండు రాష్ర్టాల సీఎంలు లాలూచి పడి ఏపీ జుట్టును కేంద్రం చేతికి అందించారని ఆరోపించారు. 2016 డ్రాప్టు నోటిఫికేషన్‌లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ మాత్రమే కేంద్రం కంట్రోల్‌లో ఉండేలా ప్రతిపాదించారని, ప్రకాశం బ్యారేజీ, సుంకేసుల, పులిచింతల లాంటి ప్రాజెక్టుల మానిటరింగ్‌ మాత్రమే చేయాలని ఉందని అన్నారు. ఇలా 2016లో 14 ప్రాజెక్టులనే అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రం బోర్డుకు పరిమితం చేయడం వల్ల నీటి హక్కులపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం సంక్రమించిందని స్పష్టం చేశారు. 


మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా మూడు కామన్‌ ప్రాజెక్టులేగాక 107 ఇతర ప్రాజెక్టులను కూడా తన కంట్రోల్‌లోకి తీసుకుందని ఆరోపించారు. ఇది రాయలసీమ, ప్రకాశం ప్రాజెక్టుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని అన్నారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. గోదావరిలో ఏపీకి కేటాయించిన నీటిని ఏ బేసిన్‌లోనైనా వాడుకోవచ్చని బచావత్‌ కమిషన్‌ క్లాజ్‌-4 స్పష్టం చేసిందని వివరించారు. 


మాజీ మంత్రి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ రాయలసీమకు నీటి హక్కును హరించడానికి పూనుకున్న ముఖ్యమంత్రి జగన్‌ను ఇక ఎదుర్కోక తప్పదని అన్నారు. దీని కోసం సీమ నేతలమంతా సమష్టిగా పోరాడుతామని స్పష్టం చేశారు. దివంగత నేత ఎన్టీరామారావుతో పాటు గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాయలసీమ రైతాంగానికి శాశ్వత మేలు జరిగేలా పనులు చేపట్టారని, జగన్‌ మొద్దు నిద్ర, అనుభవ రాహిత్యం, అసమర్థత, అనవసర వివాదాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే దుస్థితి దాపురించిందని ఆరోపించారు. బుడ్డారాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు వినియోగించి, శ్రీశైలం నీటిని రాయలసీమకు వినియోగించేలా గత ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ లిఫ్టు స్కీంను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌  పట్టిసీమ వృథా అని ఆరోపించారని అన్నారు. అప్పుడు  ఆ పార్టీలో ఉన్న తాను జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించానని గుర్తు చేశారు. కర్నూలు జిల్లాలో సిద్ధాపురం లిఫ్టుతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వివిధ  కాలువలకు నీటి విడుదల ఇకనైనా సక్రమంగా జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. 


కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసీ కెనాల్‌తో పాటు ఎల్లెల్సీ, హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు అందాలంటే.. సత్వరమే గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-07-24T06:07:16+05:30 IST