బేరాలకు లొంగకుంటే బెదిరింపులు

ABN , First Publish Date - 2021-02-01T06:26:51+05:30 IST

నంద్యాల మండలంలోని ఓ ప్రధాన పంచాయతీలో అధికార పార్టీ బలపరచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.

బేరాలకు లొంగకుంటే బెదిరింపులు

  1. ఏకగ్రీవమే లక్ష్యంగా అధికారపార్టీ యత్నాలు
  2. వైదొలగితే రూ.10 లక్షల వరకూ నజరానా
  3. మాట విననివారికి  బెదిరింపులు
  4. నంద్యాల, శ్రీశైలంలో జోరుగా రాజీ యత్నాలు
  5. ఆళ్లగడ్డలో వెనక్కు తగ్గని భూమా వర్గీయులు
  6. రహస్య సమావేశాలపై కనిపించని అధికారుల నిఘా


కర్నూలు, ఆంధ్రజ్యోతి:  నంద్యాల మండలంలోని ఓ ప్రధాన పంచాయతీలో అధికార పార్టీ బలపరచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని ఉపసంహరింపజేసేందుకు అధికార పార్టీ వర్గీయులు కొందరు బేరాలకు దిగారు. అభ్యర్థులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇచ్చేందుకూ సిద్ధపడుతున్నారు. 

గోస్పాడు మండలంలోని ఓ పంచాయతీ ఓసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. అధికార పార్టీ బలపరచిన అభ్యర్థిపై పోటీకి బీజేపీ మద్దతుదారులు కొందరు నామినేషన్లు వేశారు. దీంతో బేరాలతో పాటు బెదిరింపులూ జోరందుకున్నాయి.

ఆత్మకూరు మండలంలోని ఓ పంచాయతీకి రెండు ప్రధాన పార్టీల నుంచి బలమైన పోటీ కనిపిస్తోంది. బెదిరింపులకు దిగినా పని జరగకపోవడంతో చెరో రెండున్నరేళ్లు అధికారం పంచుకునేలా అధికార పార్టీ వర్గీయులు సంప్రదింపులకు తెరలేపారు. 

దొర్నిపాడు మండలంలోని ఓ మేజర్‌ పంచాయతీలో అధికార పార్టీ మద్దతు అభ్యర్థి నుంచి మాత్రమే సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలైంది. ఒక్కో వార్డుకు ఒక్కో నామినేషన్‌ దాఖలు చేయడంలోనూ ఆయనే చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఏకగ్రీవం కోసం ఆ అభ్యర్థి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్లు వేసేందుకు గడువు ముగిసింది. దీంతో పోటీ ఉన్నవారి నామినేషన్లను ఉపసంహరించేలా కొందరు ఒత్తిడి చేస్తున్నారు. నగదు తాయిలాలతో తలుపులు తడుతున్నారు. నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో భారీ ఏకగ్రీవాలకు అధికార పార్టీవారు పావులు కదుపుతున్నారు. ఆళ్లగడ్డ నియోజవర్గంలోనూ పలు చోట్ల ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బలాబలాలను బట్టి అభ్యర్థికి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ బేరం పెడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే కొందరు అధికారపార్టీ మద్దతుదారులు నయానో భయానో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మకూరు మండలంలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు సైతం పోటీకి సిద్ధపడ్డారు. ఇది అధికార పార్టీ నాయకులకు మింగుడు పడటంలేదు. ఆదివారం సాయంత్రం నామినేషన్లు గడువు ముగిసే సమయానికే చాలా చోట్ల ఏకగ్రీవాలకు ప్రయత్నించారు. రహస్య సమావేశాలు నిర్వహించి, అభ్యర్థులను పోటీకి దూరం పెట్టేందుకు యత్నిస్తున్నారు. బలంగా ఉన్న అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఫ్యాక్షన్‌ గ్రామ పంచాయతీలు మినహా చాలా పంచాయతీల్లో బేరసారాలు సాగుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల సానుభూతిపరులపై బైండోవర్‌ కేసులు పెట్టించడానికీ వెనకాడటంలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఏ ఒక్కరిని పలకరిస్తున్నా బేరాలు-బెదిరింపుల గురించి చెబుతున్నారు. ఎవరెవరిని బెదిరిస్తున్నారో పేర్లతో సహా చెబుతున్నారు. అయినా, ఈ వ్యవహారాల వైపు అధికారులు కన్నెత్తి చూడటంలేదు. అధికారులు మిన్నకుండటం వల్లే బలవంతపు ఏకగ్రీవాలకు జిల్లాలో తీవ్రంగా ప్రయత్నాలు మొదలయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి.


ఓడితే పరువు పోతుందని..

ఓడిపోతే పరువు పోతుందన్న భయం అధికార పార్టీ వర్గీయుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతుంటారని తెలిసినా, అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవాలకే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో వ్యతిరేకత బహిర్గతమౌతోంది. ఈ నేపథ్యంలో పోటీలు జరిగితే ఏదైనా జరగొచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీంతో ఎన్నికల్లో పోటీ కోసం లక్షలు కుమ్మరించే కంటే  పోటీ అభ్యర్థులపై బేరసారాల అస్ర్తాలు సంధించడమే మేలని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశ ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజకవర్గాల్లోని 12 మండలాల్లోనూ బేరాలు-బెదిరింపులకు దిగుతున్నారు. నంద్యాల నియోజవర్గంలో అధికార పార్టీ వర్గీయులు పోటీ అన్నది లేకుండా చూసుకోవాలని అడుగులు వేస్తున్నారు. నంద్యాల మండలంలోని మూడు ప్రధాన పంచాయతీలు, గోస్పాడుతో పాటు శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు మండలాల్లో బేరసారాల దూకుడు పెంచారు. నంద్యాల మండలంలోని ఓ పంచాయతీలో ‘ఎంపీటీసీ మీకు, సర్పంచ్‌ మాకు’ అనే దిశగా రాజీ చేసుకున్నట్లు సమాచారం. గోస్పాడు మండలంలో అధికార పార్టీకి ఎదురులేకుండా చూసుకోవాలనే తపన ఎక్కువగా కనిపిస్తోంది. భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిపై దృష్టి సారించిన కొందరు రాజీలకు, ఏకగ్రీవాలకు తీవ్రంగా కృషి చేస్తున్నారని సమాచారం. 


టీడీపీకి బలమైన నాయకులు..

శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ మండల స్థాయి నాయకులు బలంగా ఉన్నారు. పోటీకి సై అంటే సై అనే నాయకులే లక్ష్యంగా కొందరు అధికార పార్టీ నాయకులు రాజీలకు తెర తీస్తున్నారు. అధికార పార్టీ అనే బూచిని చూపి ఏకగ్రీవాలకు యత్నిస్తున్నారు. బండి ఆత్మకూరు, ఆత్మకూరు మండలాల్లో ఈ పరిస్థితి తారస్థాయికి చేరింది. పోటీ అభ్యర్థులతో రహస్య మంతనాలు జరుపతూ, అవసరమైతే పదవీ కాలాన్ని పంచుకోవడానికి కూడా అధికారపార్గీ వర్గీయులు వెనకాడటం లేదు. 2020లో అర్ధాంతరంగా ఆగిన ఎంపీటీసీ ఎన్నికల్లో స్థానికంగా బలంగా ఉన్న ఓ సామాజికవర్గం ఓటర్లను ప్రభావితం చేశారు. పరస్పర ఒప్పందాలను కుదుర్చుకుని పదవులు, స్థానాలు పంచుకునే దిశగా అధికార పార్టీ నాయకులు కథ నడిపించారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.


పౌరుషాల పురిటి గడ్డ

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 95 శాతం పంచాయతీల్లో ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికార పార్టీ కవ్వింపులు, బెదిరింపులకు తలొగ్గకుండా పలువురు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. పార్టీల కంటే వ్యక్తిగత విలువలకే ప్రాధాన్యం ఇచ్చే పంచాయతీ ఎన్నికలకు ఆళ్లగడ్డ నిలువుటద్దంగా నిలుస్తోంది. అధికార పార్టీ అభ్యర్థులకు దీటుగా పోటీ ఇస్తున్నారు. ఆరు మండలాల్లోని 104 పంచాయతీలకుగానూ 99 పంచాయతీల్లో భూమా కుటుంబం బలపరచిన అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికలకు సిద్ధమైన పలువురు, రాజీల ప్రస్థావన తెచ్చేవారికి  నామినేష న్లతో సమాధానమిస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీకి నిలబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

Updated Date - 2021-02-01T06:26:51+05:30 IST