ఈ స్వామివారిని దర్శించుకుంటే.. భూత, ప్రేత బాధలు తీరుతాయి..!

ABN , First Publish Date - 2021-08-09T05:11:52+05:30 IST

కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా..

ఈ స్వామివారిని దర్శించుకుంటే.. భూత, ప్రేత బాధలు తీరుతాయి..!

కోర్కెలు తీర్చే ఈరన్న

ఉరుకుందలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు 


కౌతాళం(కర్నూలు): కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఉరుకుందన్న ఈరన్న ప్రసిద్ధిగాంచాడు. స్వామివారిని దర్శించుకుంటే భూత, ప్రేత బాధలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సోమవారం నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం కావడంతో పెద్దఎత్తున భక్తులు తరలి రానున్నారు. సెప్టెంబరు 6వ తేదీ వరకు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉరుకుంద ఆలయ విశిష్ఠతపై కథనం.. 


స్వామి చరిత్ర: రెండు వేల సంవత్సరాల కింద సిద్ధపురుషుడు మహా తపస్వి అయిన ఈరన్న స్వామి తన చివరి రోజులు ఇక్కడే గడిపాడని చెబుతారు. నరసింహస్వామి ప్రభావం వల్లే ఉరుకుంద క్షేత్రం మహిమాన్వితమైందనే ప్రచారం ఉంది. వీరభద్ర వంశంలో జన్మించిన సిద్ధపురుషుడు శివయోగి ఈరన్నస్వామి వీరశైవ సంస్కృతి వికాసానికి ప్రయత్నించాడని చెబుతారు. ఈరన్న ఆలయంలోని రావి చెట్టును కూడా భక్తులు పవిత్రంగా భావించి కొలుస్తారు. భూత, ప్రేత, పిశాచాలు పట్టిన వారికి స్వామివారి దర్శనంతోనే బాధలు తీరుతాయని అంటారు. అందువల్లే సోమ, గురువారాలు, అమావాస్య నాడు భక్తులు పెద్దఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. తలనీలాలు సమర్పించుకొని పూజలు చేస్తారు.


రవాణా సౌకర్యం: ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం కర్నూలుకు 130 కి.మీ. దూరంలో ఉంది. ఆదోనికి 28 కి.మీ.ల దూరంలో ఉంది. శ్రావణమాసం సందర్భంగా ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, కర్ణాటకలోని సిరుగుప్ప, బళ్లారి, రాయచూరు డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు తిప్పనున్నారు.


స్వామివారి విశేష వారాలు: శ్రావణ మాసాల్లో ఈ నెల 9, 16, 23, 30, సెప్టెంబరు 2, 6, 12,19, 26 తేదీలు స్వామివారి విశేష రోజులు. శ్రావణ మాసం 5వ సోమవారం అనగా సెప్టెంబరు 6వ తేదీ స్వామివారి పల్లకి మహోత్సవం జరగనుంది.


నిత్యాన్నదానం : ఆలయంలో 2000 సంవత్సరం ఏప్రిల్‌ 13న నిత్యాన్నదానం ప్రారంభించారు. ఇందుకుగాను దాతల నుంచి రూ.2,116 చొప్పున విరాళాలుగా పొంది ఆ మొత్తం బ్యాంకులో డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీతో అన్నదానం చేస్తున్నారు. ఈ ఏడాది కరోనాను దృష్టిలో ఉంచుకొని అన్నదానం, ప్రసాదాలు పంపిణీ చేయడం కాని చేయడం లేదు. 


ఏర్పాట్లు పూర్తయ్యేనా?

శ్రావణ మాస ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు తరలి వస్తారు. ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటి వరకు కొన్ని టెండర్లు సైతం వేయలేదంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయే అర్థం చేసుకోవచ్చు. కనీసం ఎక్కడ కూడా పారిశుధ్య పనులు కూడా చేపట్టలేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారమే దర్శనమిస్తోంది.

Updated Date - 2021-08-09T05:11:52+05:30 IST