మామ మందలించాడని..!

ABN , First Publish Date - 2021-12-31T05:44:17+05:30 IST

మామ మందలించాడని ఆ తల్లి మనస్తాపం చెందింది.

మామ మందలించాడని..!
ఎల్లెల్సీ వద్ద గాలింపు చర్యలు

  1. కూతురితో కలిసి కాలువలో దూకిన తల్లి 
  2. తప్పించుకున్న నాలుగేళ్ల కుమారుడు


ఆదోని రూరల్‌, డిసెంబరు 30: మామ మందలించాడని ఆ తల్లి మనస్తాపం చెందింది. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కాలువ వద్దకు వెళ్లి పిల్లలతో కలిసి నీటిలోకి దూకింది. అయితే నాలుగేళ్ల కొడుకు తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదోని మండలం పెద్ద తుంబళంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దతుంబళం గ్రామానికి చెందిన షాషావలికి కోసిగి మండలం దొడ్డిబెలగల్‌ గ్రామానికి చెందిన హుసేని బాను(25)కు ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కూతురు శాహిస్త (6), కుమారుడు షేక్షావలి(4) ఉన్నారు. వీరికి ఎల్లెల్సీ కాలువ పక్కనే పొలం ఉంది. పొలం పనులు చేసుకుంటూ, ఉపాధి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తలు ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే భర్త తండ్రి గురువారం ఓ విషయంలో హుసేనిబానును మందలించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పొలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఇద్దరు పిల్లలను తీసుకుని పొలం పక్కనే ఉన్న ఎల్లెల్సీ వద్దకు చేరుకుంది. కూతురు, కొడుకుతో కాలువలో దూకే ప్రయత్నం చేస్తుండగా కొడుకు తప్పించుకున్నాడు. హుసేని బాను, శాహిస్త నీటిలో కొట్టుకుని పోయారు. కుటుంబ సభ్యులు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది రాత్రి 7 గంటల వరకు గాలింపు చేపట్టినా వారి అచూకీ లభ్యం కాలేదు. భర్త మంచోడే అని, అయితే ఆ కుటుంబంలో ఉన్న కలహాల వల్లే ఆమె ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్‌ఐ చంద్ర తెలిపారు. 

Updated Date - 2021-12-31T05:44:17+05:30 IST