రెండు ఒమైక్రాన్‌ కేసులు

ABN , First Publish Date - 2021-12-30T06:08:39+05:30 IST

జిల్లాలో తొలిసారిగా ఒమైక్రాన్‌ కేసులు నమోద య్యాయి.

రెండు ఒమైక్రాన్‌ కేసులు

  1. జిల్లాలో తొలి సారిగా నిర్ధారణ 
  2. యుఏఈ నుంచి డోన్‌కు వచ్చిన దంపతులకు వైరస్‌
  3. 70 మంది ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు వారికి పరీక్షలు 
  4. ఇప్పటి వరకు విదేశాల నుంచి 1,297 మంది రాక 


కర్నూలు(హాస్పిటల్‌)/డోన్‌, డిసెంబరు 29: జిల్లాలో తొలిసారిగా ఒమైక్రాన్‌ కేసులు నమోద య్యాయి. డోన్‌ పట్టణానికి చెందిన 45 ఏళ్లు, 41 ఏళ్ల దంపతులకు ఒమైక్రాన్‌ నిర్ధారణ కావడం కలకలం రేపింది. వీరిద్దరూ ఈ నెల 9వ తేదీన దుబాయ్‌కు వెళ్లారు. పది రోజుల పాటు అక్కడే ఉన్నారు. దుబాయ్‌ నుంచి తిరిగి డిసెంబరు 20న డోన్‌ పట్టణానికి చేరుకున్నారు. వీరికి డోన్‌ ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 23న కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 25వ తేదీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై ఒమైక్రాన్‌ పరీక్షల జీనోమ్‌ స్వీకెన్సీ కోసం హైదరాబాదులోని సెంట్రల్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి ఇద్దరి నమూనాలను పంపారు. ఈ నెల 29న ఒమైక్రాన్‌ నిర్ధారణ అయినట్లు రిపోర్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు చేరింది. ఒమైక్రాన్‌ సోకిన దంపతుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో ఇద్దరిని హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒమైక్రాన్‌ సోకిన బాధితుల బంధువులు, ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు ఉన్న 70 మందిని గుర్తించి మూడు రోజుల క్రితం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ వైరస్‌ సోకలేదని తెలిపారు.


జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం


జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు వెలుగు చూడడంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విజయవాడ, చెన్నై విమానాశ్రయాల ద్వారా జిల్లాకు చేరుకుంటున్న ప్రయాణికుల వివరాలను సేకరిస్తోంది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్మెంట్‌, వ్యాక్సినేషన్‌ కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఓమైక్రాన్‌ సోకిన వారి ఇంటి చుట్టు పక్కల వారికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఆరోగ్య సమస్యలు ఉంటే గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒమైక్రాన్‌ వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.


ఆ 24 మంది ఏమైనట్లు?


జిల్లాకు డిసెంబరు 1 నుంచి 29వ తేదీ వరకు 1,297 మంది విదేశాల నుంచి వచ్చారు. వారిలో 1,273 మంది సమాచారం అధికారుల వద్ద ఉంది. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం నమూనాలను హైదరాబాదుకు పంపగా.. ఇద్దరికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ అయింది. మరో 24 మంది ఆచూకీ తెలియలేదు. కొందరి ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తుండగా.. కొందరు వేరే ప్రాంతాల్లో ఉన్నామని, ఇంకా జిల్లాకు రాలేదని చెబుతున్నారు. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వారి చిరునామాలను పోలీస్‌స్టేషన్లకు పంపారు. 


ఒమైక్రాన్‌ లక్షణాలు


నడుము నొప్పి 

రాత్రిపూట చెమటలు

నీళ్ల విరేచనాలు  

తీవ్రమైన అలసట

తలనొప్పి, కండరాల నొప్పి 

గొంతు గరగర 


జాగ్రత్తలు


మాస్కు ధరించడం 

జన సమూహాలకు దూరంగా ఉండడం

చేతులను శానిటైజ్‌ చేసుకోవడం 

భౌతిక దూరం పాటించడం 


 


60 పడకలతో ఒమైక్రాన్‌ వార్డు


జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు వెలుగు చూడడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 60 పడకలతో వార్డును ఏర్పాటు చేశాం. బూత్‌బంగ్లాలోని మొదటి అంతస్థులో 60 వెంటిలేటర్లతో ఐసీయూను సిద్ధం చేశాం. చిన్న పిల్లల కోసం 11 పడకలతో ట్రయాజ్‌ను కూడా ఏర్పాటు చేశాం.


డా.సి.ప్రభాకర్‌ రెడ్డి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 


ఎవరూ భయపడొద్దు


జిల్లాలో ఒమైక్రాన్‌ గురించి ఎవ్వరూ భయపడనవసరం లేదు. దుబాయ్‌ నుంచి డోన్‌కు వచ్చిన దంపతులను హోం ఐసొలేషన్‌లో ఉంచి మెడికల్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వారికి సంబంధం ఉన్న 70 మందికి పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. వైరస్‌ వ్యాప్తిని పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాం. విదేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. నెగిటివ్‌ వచ్చిన వారిని సైతం కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్‌కు పరిమితం చేస్తున్నాం. 


- డా.బి.రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో


మోడల్‌ స్కూల్‌ ఉద్యోగికి పాజిటివ్‌


బనగానపల్లె, డిసెంబర్‌ 29: బనగానపల్లె పట్టణం మోడల్‌స్కూల్‌లో పనిచేసే కోవెలకుంట్లకు చెందిన ఉద్యోగికి బుధవారం కొవిడ్‌ నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. రెండు రోజుల క్రితం ఆ ఉద్యోగికి లక్షణాలను గుర్తించడంతో విధులకు హాజరు కాకుండా ప్రిన్సిపాల్‌ రామలక్ష్మి చర్యలు తీసుకున్నారు. 450 మంది విద్యార్థులకు డాక్టర్‌ శివశంకరుడు ఆధ్వర్యంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. మోడల్‌స్కూల్‌లో శానిటేషన్‌ చేశారు. జిల్లాలో గత 24 గంటల్లో 3,928 మందికి కరోనా శాంపిల్స్‌ సేకరించారు. ప్రస్తుతం 9 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల సంఖ్య 1,24,223కు చేరింది.

Updated Date - 2021-12-30T06:08:39+05:30 IST