శాంతియుతంగా జీవించాలి: మంత్రి
ABN , First Publish Date - 2021-05-09T05:11:56+05:30 IST
గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా జీవించాలని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సూచించారు.

ఆత్మకూరు/కొత్తపల్లి,
మే 8: గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా జీవించాలని కార్మికశాఖ మంత్రి
గుమ్మనూరు జయరాం సూచించారు. కొత్తపల్లి మండలం శివపురంలో ఇరువర్గాల మధ్య
ఘర్షణ నేపఽథ్యంలో ఆయన గ్రామాన్ని శనివారం సందర్శించారు. గ్రామంలోని
ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇరువర్గాలతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
కొవిడ్ నేపథ్యంలో సమావేశానికి గ్రామస్థులందరినీ కాకుండా, గ్రామ పెద్దలను
మాత్రమే అనుమతించారు. సీఎం జగన్ ఆదేశాలతో తానే స్వయంగా గ్రామానికి
వచ్చానని మంత్రి అన్నారు. ప్రజలు మతసామరస్యం పాటించాలని, సోదరభావంతో
మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే గ్రామపెద్దలు, పోలీసుల దృష్టికి
తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, ఘర్షణలకు పాల్పడరాదని కోరారు. గ్రామంలో
శాంతి నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఘర్షణలకు వెళ్లి జీవితాలను
నాశనం చేసుకోవద్దని అన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉన్నా, కొందరు
అసత్య ప్రచా రాలు చేయడం బాధాకరమని అన్నారు. అనంతరం గ్రామపెద్దలు
అభిప్రాయాలను తెలుసుకుని, సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్థులతో చర్చించిన
విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. అనంతరం నంద్యాల ఎంపీ
పోచా బ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు, కర్నూలు ఎమ్మెల్యేలు తొగూరు ఆర్థర్,
హఫీజ్‌ఖాన్, నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి
మాట్లాడారు. కర్నూలు డీఎస్పీలు వెంకటాద్రి, వెంకటరమణ, నందికొట్కూరు సీఐ
ప్రసాద్, ఇన్‌చార్జ్ ఎస్‌ఐ రాజ్‌కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు
చేశారు. గ్రామంలో ఘర్షణ కారణంగా భయాందోళనకు గురవుతున్నామని, ఇకపై గొడవలు
జరగకుండా చూడాలని పలువురు మహిళలు ఎమ్మెల్యే ఆర్థర్‌ను కోరారు. ఇకపై ఎలాంటి
గొడవలు జరగకుండా చూస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. గ్రామంలో ఏదైనా
సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.