రైతుకు అన్నం లేదు

ABN , First Publish Date - 2021-10-31T05:50:18+05:30 IST

పది మందికి అన్నం పెట్టే రైతులు మార్కెట్‌ యార్డుకు వస్తే భోజనానికి ఇబ్బందిపడాల్సి వస్తోంది.

రైతుకు అన్నం లేదు

  1. యార్డులో మొదలుకాని రాయితీ పథకం 
  2. కొరవడిన ముందస్తు ప్రణాళిక


ఆదోని, అక్టోబరు 30: పది మందికి అన్నం పెట్టే రైతులు మార్కెట్‌ యార్డుకు వస్తే భోజనానికి ఇబ్బందిపడాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు సరుకు వదిలి బయటికి వెళ్లాల్సి వస్తోంది. ఆదోని మార్కెట్‌ యార్డులో ఇదీ పరిస్థితి. సీజన్‌ మొదలైనందున పత్తి యార్డుకు రోజుకు 1500 నుంచి రెండు వేల మందికి పైగా రైతులు వస్తున్నారు. 2015-16లో అప్పటి ప్రభుత్వం యార్డులోనే రైతులకు మధ్యాహ్నం రాయితీ భోజనం పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కూడా ఇది కొనసాగింది. మార్కెట్‌ యార్డు ఉన్నత అధికారులు సహకరించారు. దీనికి అవసరమైన నిధులు యార్డు నుంచి ఖర్చు పెట్టారు. ఏటా సెప్టెంబరు నుంచి పత్తి సీజన్‌ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌ వరకు రైతులకు రాయితీ భోజనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందించేవారు. యార్డుకు వచ్చిన రైతులు తమ సరుకు ఐడీ నెంబర్‌ చూపించి రూ.15 ఇస్తే అధికారులు టోకన్‌ ఇచ్చేవారు. ఈసారి అక్టోబరు నెల దాటి నవంబరు నెల వస్తున్నా పథకం ప్రారంభించలేదు. 


ముందస్తు ప్రణాళిక ఏదీ..?


సెప్టెంబరు నుంచి మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు మొదలవుతాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో ఊపందుకుంటాయి. ఆదోని మార్కెట్‌ యార్డులకు డివిజన్‌లోని గ్రామాలతోపాటు అనంతపురం, మహబూబ్‌నగర్‌, రాయచూరు, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి కూడా రైతులు దిగుబడులను తీసుకొని వస్తారు. రాష్ట్రంలోనే ఆదోని మార్కెట్‌ యార్డుకు అతి పెద్దదనే గుర్తింపు ఉన్నది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు భోజన సౌకర్యం కల్పిస్తామని యార్డు సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అయితే అధికార యంత్రాంగం జాప్యంతో పాటు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ పథకం పట్టాలు ఎక్కలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇస్కాన్‌ సంస్థ భోజన ఏర్పాట్లు చేసింది. రైతులు రూ.15, మార్కెట్‌ యార్డు కమిటీ రూ.20, మిగతాది ఇస్కాన్‌ సంస్థ ఖర్చు భరించి వేల మందికి భోజనాలు అందించింది. అయితే ఈ ఏడాది ఇంత వరకు ఈ పథకం ప్రారంభించలేదు. దీంతో రెండు నెలలుగా రైతులు ఇబ్బందిపడుతున్నారు. మధ్యాహ్నం కాగానే రైతులు యార్డుకు తరలించిన దిగుబడులను వదిలేసి బయటికి వెళ్లి హోటళ్లలో భోజనం చేయాల్సి వస్తోంది. మార్కెట్‌ యార్డు సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఇస్కాన్‌ సంస్థ ద్వారానే భోజనాలు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోనే వారికి వంట సామగ్రి అవసరం కావడంతో కొంత ఆలస్యమైందన్నారు. నవంబరు మొదటి లేదా రెండో వారంలో భోజన ఏర్పాట్లు జరుగుతాయని వివరించారు.

Updated Date - 2021-10-31T05:50:18+05:30 IST