అధిక ధరలతో బతుకు భారం
ABN , First Publish Date - 2021-10-26T05:29:07+05:30 IST
వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్, ఇసుక, సిమెంట్, వంటనూనెలు, విద్యుత్ చార్జీల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలకు బతుకు భారమైపోయిందని టీడీపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

- అమ్మ ఒడి ఇచ్చి నాన్న బుడ్డీతో వసూలు చేస్తున్నారు
- మోటార్లకు మీటర్లు వేస్తే రైతుకు ఉరి బిగించినట్లే
- గౌరు వెంకట్‌రెడ్డి దంపతులు
గడివేముల, అక్టోబరు 25: వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్, ఇసుక, సిమెంట్, వంటనూనెలు, విద్యుత్ చార్జీల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలకు బతుకు భారమైపోయిందని టీడీపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మండలంలోని కె.బొల్లవరం గ్రామంలో సోమవారం వారు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రేషన్‌కార్డులు రద్దయ్యాయని, పింఛన్లు ఇవ్వడం లేదని, ఇంటి స్థలం విషయంలో వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గడివేములలో గౌరు దంపతులు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ లోటు ఉన్నా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ పథకం సద్వినియోగం చేసుకుంటూ కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందించారని అన్నారు. డిస్కిమ్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించారని అన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారని అన్నారు. రూ.200 విద్యుత్ బిల్లు వచ్చే ఇంటికి రూ.1,000 విద్యుత్ బిల్లు వస్తున్నదని అన్నారు. నిత్యావసర సరుకులు, విద్యుత్ చార్జీలు పెరిగి సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. అమ్మఒడి ఇస్తూ మద్యం ధరలు పెంచి నాన్న బుడ్డితో తిరిగి వసూలు చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం బిగిస్తే రైతుల మెడకు ఉరి వేసినట్లేనని అన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడంతో కొత్తగా పరిశ్రమలు రావడం లేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సీతారామిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, సత్యనారాయణరెడ్డి, సుభద్రమ్మ, రామచంద్రారెడ్డి, కృష్ణయాదవ్, వడ్డు ప్రశాంతి, కృష్ణామాచారి, ఈశ్వర్‌రెడ్డి, రఫిక్ పాల్గొన్నారు.