టీజీ ఆయకట్టుకు నీరివ్వాల్సిందే
ABN , First Publish Date - 2021-12-31T05:40:45+05:30 IST
తెలుగుగంగ ఆయకట్టు పంట పొలాలకు రబీ సీజన్‌లో సాగు నీరందించి రైతులను ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.

- శిల్పా హామీతోనే 1000 ఎకరాల్లో వరి సాగు
- నీరందకుంటే రూ.3.5 కోట్ల నష్టం
- నేడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
- శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
ఆత్మకూరు, డిసెంబరు 30: తెలుగుగంగ ఆయకట్టు పంట పొలాలకు రబీ సీజన్‌లో సాగు నీరందించి రైతులను ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలుగోడు, బండిఆత్మకూరు మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో కురిసిన అధిక వర్షాలతో పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రబీ పంటలపైనే రైతులు ఆశ పెట్టుకున్నారని అన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బండి ఆత్మకూరు మండలంలో డిసెంబరు 2న వరి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తూ మార్చి 15వ తేది వరకు ఎండకారు పంటలకు తెలుగుగంగ కాల్వ, కేసీ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. దీంతో వెలుగోడు, బండిఆత్మకూరు మండలాల్లో రైతులు సుమారు 1000 ఎకరాలకు పైగా వరి నారుమళ్లను సాగుచేసుకున్నారని అన్నారు. కాగా ఈ నెల 22న కలెక్టర్ కోటేశ్వరరావు తెలుగుగంగ లైనింగ్ పనుల పేరిట ఆయకట్టుకు రబీ సీజన్‌లో సాగునీరు ఇవ్వలేమని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రని అన్నారు. ఒక్కో ఎకరా నారుమడిని సాగు చేసేందుకు రూ.35వేల వరకు రైతులు ఖర్చు చేశారని అన్నారు. ఇప్పుడు నీరు అందివ్వకుంటే రెండు మండలాల్లోనే నారుమళ్లకు రూ.3.5 కోట్లు రైతులు నష్టపోతారని అన్నారు. ఈ సమస్యపై శుక్రవారం రైతులతో కలిసి కలెక్టర్‌ను కలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, టీడీపీ నాయకులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్, అబ్దుల్లాపురం బాషా, ఫకృద్దీన్, షాబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.