ఏడురోజుల్లో పదివేలు
ABN , First Publish Date - 2021-05-05T06:09:34+05:30 IST
జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

- జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇది
- మృతుల సంఖ్య 74
- తీవ్రమవుతున్నసెకండ్ వేవ్
కర్నూలు-ఆంధ్రజ్యోతి: జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య రోజుకు రెండున్నర వేలను దాటిపోయింది. అధికారులకు ముందుచూపు లేకపోవడం, నిర్లక్ష్యం వెరసి కరోనా సెకెండ్ వేవ్ తీవ్రమవుతోంది. నెలన్నర వ్యవధిలోనే జిల్లాలో కేసులు సంఖ్య 24 వేలు దాటిపోయింది. గత ఏడాది మార్చి 28న జిల్లాలో మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత నెమ్మదిగా కేసులు పెరిగాయి. మొదటి కేసు తర్వాత ఇరవై వేల కేసులు నమోదు కావడానికి దాదాపు నాలుగు నెలల పైనే పట్టింది. కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం ఈ సంఖ్య కేవలం నెలన్నరలోనే దాటిపోయింది. పైగా 74 మంది ఇప్పటికి చనిపోయారు. ఏప్రిల్ 54 మంది, మే నెల నాలుగు రోజుల్లోనే 20 మంది చనిపోయారు. ఈ విడత మార్చి 15 తర్వాత నుంచి పెరుగుతూ వచ్చి ఏప్రిల్ మొదటి వారం నుంచి రోజుకు 500 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 84,462 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 11,642 కేసులు ఉన్నాయి.
గత ఏడు రోజుల్లో..
సెకండ్ వేవ్ మొదలయ్యాక మార్చిలో 703 కేసులు, ఏప్రిల్‌లో 14,954 కేసులు నమోదయ్యాయి. మే 1వ తేది 1,381 కేసులు, , 2వ తేది 2,516, 3వ తేది 2,628 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,396 కేసులు నమోదయ్యాయి. గడిచిన వారంలో జిల్లాలో మొత్తం 10,562 కరోనా కేసులు నమోదయ్యాయి. సెకెండ్ వేవ్ మొదలైన నెలన్నరలో 24,281 మంది కరోనా బారినపడ్డారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, ఇప్పటి నుంచి రోజుకు 3 వేల కేసులు నమోదయ్యే అవ కాశం ఉందని కలెక్టర్ జి. వీరపాండియన్ ఓ మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ ఉధృతిని చూస్తే కేసులు సంఖ్య 50 వేల మార్కును దాటడానికి పెద్ద సమయం పట్టేలా లేదు.
జాగ్రత్తలు పాటించాల్సిందే..
మొదటి వేవ్‌లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక ఇబ్బందులకు లోనయ్యారు. రోజువారీ పనుల అత్యవసరాలు, జీవనోపాధుల ఒత్తిడి వల్ల సెకండ్ వేవ్ మొదలయ్యాక కూడా ప్రజలు రొటీన్ పనులకు దూరం కాలేకపోయారు. దీంతో జిల్లాలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి.
వారం రోజులుగా నమోదవుతున్న కేసుల వివరాలు
తేదీ కేసులు మరణాలు
28-4 798 4
29-4 876 2
30-4 967 4
01-5 1381 5
02-5 2516 4
03-5 2628 7
04-5 1396 4
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు. వచ్చినా కొవిడ్ నిబంధనలు పాటించాలి.
- రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో, కర్నూలు