ఆయకట్టు ఎదురుచూపు
ABN , First Publish Date - 2021-05-20T06:32:59+05:30 IST
పక్కనే తెలుగు గంగ నీరు వెళుతోంది. బ్లాక్ చానళ్లు తవ్వితే సుమారు 27 వేల ఎకరాలు తడుస్తాయి. రెండు పంటలు పండుతాయి.

- అసంపూర్తిగా బ్లాక్ చానళ్ల నిర్మాణం
- 16 ఏళ్ల క్రితం మొదలై.. ఆగిన పనులు
- రాజకీయ ఒత్తిళ్లతో ఆపేసిన కాంట్రాక్టర్
- 27 వేల ఎకరాలకు అందని సాగునీరు
రుద్రవరం, మే 19: పక్కనే తెలుగు గంగ నీరు వెళుతోంది. బ్లాక్ చానళ్లు తవ్వితే సుమారు 27 వేల ఎకరాలు తడుస్తాయి. రెండు పంటలు పండుతాయి. ఇదే సంకల్పంతో 2005లో టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు. కానీ పర్సెంటేజీల కోసం రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. కారణం ఏదైనా.. పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశాడు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే.. ఏటా రూ.కోట్ల విలువజేసే పంట దిగుబడులు వచ్చేవి. ఆ మేరకు వేలాది మంది రైతులకు మేలు జరిగేది. కానీ.. 16 ఏళ్ల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ పనుల గురించి పట్టించుకోవడం మానేశారు.
తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి మండలాల పరిధిలోని వేలాది ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 20 నుంచి 27 వరకూ బ్లాక్ చానళ్లను తవ్వేందుకు 2005లో టెండర్లు పిలిచారు. 20, 21 బ్లాక్ చానళ్లకు రూ.10 కోట్లు, 22 నుంచి 27వ బ్లాక్ చానల్‌కు రూ.11 కోట్లకు టెండర్లు దక్కించుకున్నారు. పనులు ప్రారంభించిన తరువాత రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే పనులు నత్తనడకన సాగాయని రైతులు అంటున్నారు. కొంతమేరకు పనులు పూర్తి అయిన తరువాత కాంట్రాక్టరు పనులను ఆపేశారు. ఆ తరువాత వ్యవహారం కోర్టుదాకా వెళ్లింది. కాలం గడిచే కొద్దీ ధరలు పెరిగాయి. పాత లెక్కల ప్రకారం పనులను ముందుకు సాగించే పరిస్థితి లేకపోయింది. దీంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి.
వర్షపు నీరే దిక్కు
తెలుగు గంగ బ్లాక్ చానల్, సబ్ చానల్ పనులు అసంపూర్తిగా ఉండటంతో రైతులకు సాగునీరు అందడం లేదు. వర్షాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. సారవంతమైన భూములు ఉన్నా, చుక్కనీరు అందక ఏటా రూ.కోట్లలో పంటలు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అధికారులు ఎలాంటి పనులూ చేపట్టడం లేదు. సీజన్‌లో పనులు మొదలు పెట్టి మధ్యలోనే ఆపేయడం పరిపాటిగా మారింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో తవ్విన కాలువలను కొందరు రైతులు పూడ్చివేశారు. సాగునీరు వస్తుందన్న ఆశలో పంట పొలాల్లో కాలువలు వస్తుంటే సంతోషించామని, నీరు ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు కాలువలకు వృథాగా భూమిని ఎందుకు వదలాలని కొందరు పూడ్చివేశారని తెలుస్తోంది.
ఏటా ఎదురుచూపులే..
తెలుగు గంగ బ్లాక్ చానళ్ల పనులు పూర్తి అయితే సాగునీటికి ఇబ్బందులు ఉండవని చివరి ఆయకట్టు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పనులు మొదలైనప్పుడు ఇక తమ కష్టాలు తీరుతాయని భావించారు. 20వ బ్లాక్ చానల్ కింద 4,064 ఎకరాలు, 21వ బ్లాక్ చానల్ కింద 9,721 ఎకరాలు, 22వ బ్లాక్ చానల్ కింద 5,334, 23వ బ్లాక్ చానల్ కింద 1,578, 24వ బ్లాక్ చానల్ కింద 2,600 ఎకరాలు, 25వ బ్లాక్ చానల్ కింద 2,808 ఎకరాలు, 26వ బ్లాక్ చానల్ కింద 649 ఎకరాలకు, 27వ బ్లాక్ చానల్ కింద 344 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది.
ఎన్నికల్లో వాగ్దానం
తెలుగు గంగ బ్లాక్ చానల్ పనుల గురించి ఇప్పటికి మూడు ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు వాగ్దానాలు చేశారు. ఓట్లు వేసి గెలిపించగానే పట్టించుకోవడం మానేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. తమ ప్రాంత రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శిస్తున్నారు. ఎప్పుడో పూర్తవాల్సిన పనులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, అధికారులు, నాయకులు ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
వెంటనే పూర్తి చేయాలి..
గంగ బ్లాక్ చానళ్లు అసంపూర్తిగా ఉండటంతో సాగు నీరు అందటం లేదు. ప్రతి ఏటా పంట కాలువలు పూర్తి చేస్తారని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం వెంటనే పనులను పూర్తి చేయించాలి.
- మనోహర్‌రెడ్డి, రైతు, నాగులవరం
ఏళ్లు గడిచినా..
గంగ బ్లాక్ చానల్ పనులు ఏళ్లు గడిచినా పూర్తి కావటం లేదు. మెట్ట భూములకు సాగు నీరు అందుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాం. 16 ఏళ్ల నుంచి సాగునీరు అందటం లేదు. చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- రామసుబ్బారెడ్డి, రైతు, ముత్తలూరు
నివేదిక పంపించాం..
తెలుగుగంగ బ్లాక్ చానళ్లు, డిస్ట్రిబ్యూటరీ చానళ్ల పనులపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వ ఆదేశాలు అందాల్సి ఉంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే కొత్తగా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయిస్తాం.
- నాగేంద్రకుమార్, తెలుగుగంగ డీఈ