టీడీపీ నాయకుల నిరసన
ABN , First Publish Date - 2021-07-09T05:22:13+05:30 IST
రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు.

కల్లూరు, జూలై 8: రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ మేరకు మాధవీనగర్‌లోని తన స్వగృహంలో గురువారం ఆమె విలేఖరుల సమావేశం నిర్వహించారు. రైతుభరోసా పథకం కింద ఒకే దఫాలో రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.7,500 ఇస్తున్నారని, ఐదేళ్లల్లో ఒక్కో రైతుకు రూ.30 వేలు ఎగనామం పెడుతుందని విమర్శించారు. పంటలకు మద్దతు ధర లభించకపోవడం, ఈక్రాప్ బుకింగ్ ఉంటేనే పంటలను కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను సకాలంలో పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సొసైటీ కేంద్రంలో ఎరువులు పక్కదారి పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. సాధారణ పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు రూ.50 వేలు ఇవ్వాలని అన్నారు. దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, చేతివృత్తుల వారికి రూ.15వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఇన్‌ఫుట్ సబ్సిడీని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి, కల్లూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ఎన్‌వీ రామక్రిష్ణ, నాయకులు ప్రభాకర్ యాదవ్, నాగేశ్వరరెడ్డి, ఈశ్వర్, భరత్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
తుగ్గలి: రైతులకు అన్యాయం చేసి రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్న రైతు దగా ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని టీడీపీ మండల కన్వీనర్ తిరుపాలునాయుడు, మాజీ ఎంపీపీ కొమ్మే వెంకటేష్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని రాతన గ్రామంలో రైతు దినోత్సవం కాదు రైతు దగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకపోగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించలేదని అన్నారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఉచిత విద్యుత్ అందిస్తూ ఉంటే వాటికి మీటర్లు బిగించడం, రుణమాఫీని రద్దుచేయడం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం ఇలా రైతులకు అందే ప్రతి పథకాన్ని నిర్వీర్యం చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతులకు అన్యాయం చేసి రైతు దినోత్సవం జరపడం ఎంతవరకు న్యాయమన్నారు. రైతుల అభివృద్ధి కోసం పాటుపడేది ఒక టీడీపీనేనని అన్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్‌ను పెంచి నీటిని సంపూర్ణంగా అందించాలన్నారు. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం లాగే రూ.15వేలు అందించాలన్నారు. వెంటనే రుణమాఫీ బకాయిలను చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్‌చౌదరి, తిమ్మయ్యచౌదరి, వెంకటరాముడుచౌదరి, మైరాముడు, వెంకటరాముడు గౌడ్, సత్యప్రకాష్, సురేంద్ర, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
