అగ్రిగోల్డ్‌ బాధితులకు అరకొర సాయం

ABN , First Publish Date - 2021-08-26T05:13:28+05:30 IST

అగ్రిగోల్డ్‌ బాధితులకు అరకొరం సాయం చేయడం దారుణమని, మొత్తం ఒకేసారి చెల్లించాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు అరకొర సాయం
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 25: అగ్రిగోల్డ్‌ బాధితులకు అరకొరం సాయం చేయడం దారుణమని, మొత్తం ఒకేసారి చెల్లించాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.అగ్రిగోల్డు సంస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, వాటిని విక్రయించి బాధితులకు ఒకేసారి డిపాజిట్లు పూర్తి స్థాయిలో అందించేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని సోమిశెట్టి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డు డిపాజిటర్లను ఆదుకునేందుకు చంద్రబాబు రూ.300 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో కేటాయించిన రూ.300కోట్లలో రూ.238 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం  అందజేసిందన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టి చంద్రబాబు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహిస్తే.. చిట్‌ఫండ్స్‌ పేరుతో రాజశేఖర్‌ రెడ్డి వివిధ సంస్థల ద్వారా డబ్బులు వసూలు చేయించి పేదలను లూటీ చేయించారని సోమిశెట్టి ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ సంస్థ డైరెక్టర్‌ను వైసీపీ తరుపున గత ఎన్నికల్లో పోటీకి నిలపాలని ప్రయత్నించడం జరగలేదా? అని సోమిశెట్టి ప్రశ్నించారు.  ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డు బాధిత కుటుంబాలకు 5 లక్షల మేరకు చంద్రబాబు పరిహారం అందించారని గుర్తు చేశారు. అగ్రిగోల్డు సంస్థ ఆస్తులను చంద్రబాబు ప్రభుత్వం జప్తు చేయించి 8 నెలల్లో ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి అటాచ్డ్‌ చేయించారన్నారు. ఆ సమయంలోనే చంద్రబాబు అగ్రిగోల్డు లావాదేవిలపై సీబీఐ విచారణకు ప్రధానికి లేఖ రాశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి  నాగేంద్రకుమార్‌, తెలుగు యువత అధ్యక్షుడు ఎస్‌.అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-26T05:13:28+05:30 IST