ప్రాణం తీసిన ఈత
ABN , First Publish Date - 2021-10-29T05:24:31+05:30 IST
ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటికుంటలో పడి మృత్యువాత పడ్డారు.

- అల్లూరులో ముగ్గురు చిన్నారుల మృతి
- బడి వదిలాక నీటి కుంటకు వెళ్లిన విద్యార్థులు
నందికొట్కూరు రూరల్, అక్టోబరు 28: ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటికుంటలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు, అల్లూరు ఎంపీపీ పాఠశాల విద్యార్థులు విశాల్(8), శరత్ (8), మహేష్(10) బుధవారం పాఠశాల వదిలిన తరువాత ఇంటికి వెళ్లకుండా, పాఠశాలకు కూత వేటు దూరంలో ఉన్న నీటికుంటకు వెళ్లారు. వీరి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు. ఇంట్లో పిల్లలు కనిపించకపోవడంతో గాలించారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. చిన్నారులు కుంట వైపు వెళుతుండగా చూశానని గ్రామానికి చెందిన పశువుల కాపరి చెప్పడంతో గురువారం ఉదయాన్నే నీటి కుంటలో గాలించారు. శాతనకోటకు చెందిన గజ ఈతగాడు లాలుస్వామి కుంటలో గాలించడంతో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన పక్కీరయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడు విశాల్ మూడో తరగతి చదువుతున్నాడు. సంజీవరాయుడు, మహేశ్వరి దంపతుల కుమారుడు శరత్ 4వ తరగతి, మధు, మరియమ్మ దంపతుల కుమారుడు మహేష్ 5వ తరగతి చదువుతున్నాడు. బడికి వెళ్లిన బిడ్డలు ఇలా విగతజీవులుగా కనిపించడంతో బాధిత కుటుంబాలవారు భోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.