మొండిగా.. ముందుకు..!

ABN , First Publish Date - 2021-05-02T05:51:25+05:30 IST

పది, ఇంటర్‌ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

మొండిగా.. ముందుకు..!
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాలు (ఫైల్‌ )

  1. 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు
  2. జూన్‌ 7 నుంచి పది పరీక్షలు
  3. ప్రబలుతున్న కొవిడ్‌తో సర్వత్రా ఆందోళన
  4. రద్దు చేయాలని వివిధ వర్గాల డిమాండ్‌
  5. పరీక్షల కొనసాగింపునకే ప్రభుత్వం మొగ్గు


కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 1: పది, ఇంటర్‌ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోందన్న విమర్శలు వస్తున్నాయి. సెకెండ్‌ వేవ్‌ మొదలయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు పలువురు కొవిడ్‌ బారిన పడ్డారు. కొందరు ఉపాధ్యాయులు మృతి చెందారు. బాధితుల్లో చాలామంది ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. పాఠశాలలను నడుపుతామని చెబుతూనే ఒకటి నుంచి 9వ తరగతులకు వేసవి సెలవులను ప్రకటించింది. వారికి పరీక్షలు లేకుం డానే పై తరగతులకు ప్రమోట్‌ చేసింది. పది, ఇంటర్‌ తరగతులు కొనసాగుతాయని తెలిపి, మే 1 నుంచి 31వ తేదీ వరకు వారికి కూడా వేసవి సెలవులు ప్రకటించింది. కానీ షెడ్యూల్‌ ప్రకారం పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. పది పరీక్షలు జూన్‌ 7 నుంచి ఉంటాయని, వారికి అవసరమైతే.. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మే 5 నుంచి ఇంటర్‌ పరీక్షలు మొదలవుతాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను మమ అనిపించారు. వార్షిక పరీక్షలకు ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఏర్పాట్లు సాధ్యమేనా..
ఫ జిల్లాలో 269 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో మొత్తం 77,323 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 38,158 మంది, ద్వితీయ సంవత్సరం 38,285 మంది, ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులు 888 మంది ఉన్నారు. మొత్తం 116 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగితే కొవిడ్‌ నిబంధనల ప్రకారం కేంద్రాల సంఖ్య రెట్టింపు అవుతుంది. అన్నిచోట్లా వసతులను సమకూర్చడం ఇంటర్‌ బోర్డు అధికారులకు తలకుమించిన భారంగా మారుతుంది.


గూడూరు, దేవనకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను, కృష్ణగిరి ఆదర్శ పాఠశాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పరీక్షల నిర్వహణ ఆర్‌ఐవో సాలాబాయి ఆధ్వర్యంలో డీఈవో, డీఈసీ కమిటీ సభ్యులతో పాటు నాలుగు ప్లయింగ్‌ స్క్వాడ్స్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ 12 మంది సభ్యులను నియమించారు. కరోనా విపత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా కర్నూలు టౌన్‌ మోడల్‌ కళాశాలలో కెమిస్ర్టీ లెక్చరర్‌ ఎంఎస్‌ రాఘవేంద్రను నియమించారు.


పదో తరగతి విద్యార్థులు జిల్లాలో 53,627 మంది ఉన్నారు. గత ఏడాది నుంచి చదివిన అంశాలనే చదువుతున్నారు. కొవిడ్‌ భయంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చదవాలనే ఆసక్తి ఉన్నా, భయం కారణంగా వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ర్యాంకులు, గ్రేడ్ల కంటే తమ బిడ్డల ఆరోగ్యమే ముఖ్యమని తల్లిదండ్రులు అంటున్నారు.


విద్యార్థులు, గురువులకు పాజిటివ్‌
జిల్లాలో ఐదుగురు ఉపాధ్యాయులు కొవిడ్‌తో చనిపోయారు. 282 మంది చికిత్స పొందుతున్నారు. 1808 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించవద్దని ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. పరీక్షలను రద్దు చేయాలని, అందరినీ పాస్‌ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. అయితే, గత ఏడాది పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించని కారణంగా జాతీయ స్థాయిలో జరిగే మిలిటరీ ఉద్యోగాలకు విద్యార్థులు దూరమయ్యారని ప్రభుత్వం సాకు చెబుతోంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సహేతుకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతిష్టాత్మకమైన సెంట్రల్‌ బోర్డు  పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపుతోంది. ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు పోటీ పరీక్షలు నిర్వహిస్తారని, విద్యార్థుల మార్కులను చూసి ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇవ్వడం లేదని పలువురు అంటున్నారు.


ఎవరి మాటా వినరా..?
విద్యార్థి, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, అధ్యాపకులు.. ఇలా అన్ని వర్గాలవారూ పరీక్షలు వద్దని ముక్తఖంఠంతో కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఏ ఒక్కరి మాటా వినడం లేదు. విద్యాసంస్థలు కొనసాగిన సమయంలో చాలా చోట్ల తరగతి గదులను శానిటైజ్‌ చేయలేదు. పరీక్షల సమయంలో శానిటేషన్‌, భౌతిక దూరం, ఇతర సౌకర్యాలను ఎలా కల్పిస్తారోనన్న సందేహాలు వ్యక్తమౌ తున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులు, విధుల్లో ఉండే ఉద్యోగుల భారీ సంఖ్యలో పరీక్ష కేంద్రాలకు వస్తారు. రద్దీ కారణంగా వైరస్‌ ప్రబలితే పరిస్థితి ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


ఆషామాషీ కాదు..
పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ ఆషామాషీ కాదు. పరీక్షల నిర్వహణ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడి వరకు అధికారులకు, ఉపాధ్యాయులకు యజ్ఞంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిస్కు తెలియనిది కాదు. ప్రతిపక్ష నాయకులు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తుంటే.. వారి మాటలను ఎందుకు పట్టించుకోవాలనే ధోరణిలో ప్రభు త్వం ఉంది. ఈ ప్రతిపాదన రాకముందే పరిస్థితులను బట్టి పరీక్షలను రద్దు చేసి ఉంటే.. ఆ క్రెడిట్‌ ప్రభుత్వానికి దక్కేది కదా..! ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పరీక్షలను రద్దు చేయాలి.
 - ఎం.శేషఫణిరాజు, తెలుగునాడు
ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్‌ జనరల్‌ సెక్రటరీ


వాయిదా వేయాలి..
కరోనా  విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆరోగ్యం దృష్ట్యా పది, ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే అభ్యంతరం లేదు. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే అందరినీ పాస్‌ చేయాలి. ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2 పరీక్షల ఆధారంగా గ్రేడింగ్‌ ఇస్తే సరిపోతుంది. పరీక్షలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆందోళనలో ఉన్నారు.
 - కరె కృష్ణ, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు


 పకడ్బందీగా చర్యలు..
ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్‌ బాధితులకు ఐసొలేషన్‌ గదిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. విద్యార్థు లను థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష చేసి కేంద్రంలోకి పంపాలి. విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించాలి.
 - ఆర్‌ఐవో సాలాబాయి



Updated Date - 2021-05-02T05:51:25+05:30 IST