పెట్రో ధరల పెంపుపై నిరసన
ABN , First Publish Date - 2021-02-27T05:15:19+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండకడుతూ మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుదామని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండకడుతూ మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుదామని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌కు వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు. రాస్తారాకోలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. ఇంధనం ధరలు పెంచి సామాన్యులపై భారం మోపడం దారుణమని అన్నారు. ఇంధనం ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నంద్యాల (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండకడుతూ మోదీ ప్రభుత్వానికి పాడెకడదామని వామపక్ష, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం భారత్ బంద్‌కు మద్దతు తెలుపుతూ నంద్యాలలో వివిధ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనాలు, రాస్తారోకోలు చేపట్టారు.
నంద్యాల శ్రీనివాససెంటర్ జంక్షన్లో వామపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్రోలియం ఉత్పత్తులపై 238 శాతం అధిక ధరలను పెంచుతూపోతోందని అన్నారు. 38 శాతం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో తోట మద్దులు, బాబా ఫకృద్దీన్, ప్రసాద్, శంకర్, మస్తాన్‌వలి, నాగరాజు, బాల వెంకట్, గౌస్, రఫి, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలోని లారీ, మోటార్ వర్కర్స్ యూనియన్, లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూనెపల్లె పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవైటీకరణను ఆపాలని, రైతులకు నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు లక్ష్మణ్, వీరసేన, బాబుల్లా, నరసింహారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.
బనగానపల్లె: బనగానపల్లెలోని పెట్రోల్ బంకు కూడలిలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సీపీఎం డివిజన్ నాయకుడు జేవీ సుబ్బయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పెట్రోల్‌బంకు కూడలిలో మానవహారం నిర్మించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు రాముడు, ఆటో యూనియన్ నాయకుడు దస్తగిరి, జాఫర్, సంజన్న హమాలీ యూనియన్ నాయకుడు కరీముల్లా, బషీర్, రామాంజనేయులు, మాబాషా, నాగరాజు శ్రీను, నాగేంద్ర, పెద్దమునెయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీపీఐఎంఎల్ న్యూడెమక్రసీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. నందికొట్కూరులో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ ఆద్వర్యంలో ఆటోకు తాళ్లుకట్టి లాగారు. వివిధ పార్టీల నాయకులు రమేష్‌బాబు, జగదీష్‌బాబు, నరసింహులు, నాగేశ్వరరావు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలను ఛిన్నభిన్నం చేస్తున్నాయని, వెంటనే తగ్గించాలని జూపాడుబంగ్లా కేజీ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, ఏఐటీయూసీ రాష్ట్ర సమితీ నాయకులు రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఆటోలకు తాడుతో లాగి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, శేఖర్, సురేష్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: పెంచిన పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు ఏసురత్నం డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు నరసింహ నాయక్, మాబాషా, రామ్‌నాయక్, శివకుమార్ తదితరులు ఉన్నారు.
దిలాంగ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కేజీ రోడ్డుపై లారీలను నిలుపుదల చేసి కొన్ని గంటల పాటు బంద్ చేపట్టారు. ఆ సంఘం అధ్యక్షుడు మస్తాన్‌వలి, నాయకులు ఉమర్, షఫివుల్లా, బాషా తదితరులు ఉన్నారు.
