శ్రీరస్తు.. సౌభాగ్యమస్తు

ABN , First Publish Date - 2021-08-20T06:01:51+05:30 IST

శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వేడుక వరలక్ష్మి వ్రతం. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వ్రతాన్ని ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

శ్రీరస్తు.. సౌభాగ్యమస్తు
సామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు

  1. నేడు సంపదల తల్లి వేడుక
  2. వరలక్ష్మి వ్రతానికి మహిళల ఏర్పాట్లు


కర్నూలు (కల్చరల్‌), ఆగస్టు 19: శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వేడుక వరలక్ష్మి వ్రతం. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వ్రతాన్ని ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దేవాలయాలు, ధార్మిక క్షేత్రాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించనున్నారు. అపార్ట్‌మెంట్లు, గృహ సముదాయాలలో వరలక్ష్మి వ్రతం కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కావడంతో శుక్రవారం నుంచి టీటీడీ, ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ఆలయాల్లో మనగుడి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. 


పూలతో విశేష పూజలు


సంపదల తల్లి లక్ష్మీదేవిని వరలక్ష్మి వ్రతం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో అర్చిస్తారు. దేవదేవి పూజలో తామరపూలు, మొగలి చెండు, బిల్వం, చేమంతులు, మల్లెలు, గులాబీ పూలను వినియోగిస్తారు. మహాదేవికి కుడుములను నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు, కుంకుమ, తాంబూలాదులను బ్రాహ్మణులు, ముత్తయిదువులకు వాయనంగా ఇస్తారు.


మండిన ధరలు


వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో నగరంలోని మార్కెట్‌ ప్రాంతం గురువారం కళకళలాడింది. మహిళలు వాయనాలు ఇచ్చేందుకు జాకెట్లు, పూజా సామగ్రి కొనుగోలు చేశారు. మామిడి ఆకులు, అరటి బోదెలు, పూజాద్రవ్యాల కోసం పాతబజార్‌, ఎన్‌ఆర్‌ పేట, సి.క్యాంపు రైతు బజారుకు తరలివచ్చారు. పూజల్లో విశేషంగా ఉపయోగించే పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో మల్లెలు కర్నూలు మార్కెట్లో రూ.400పైగా పలికాయి. బంతిపూలు, చిన్న గులాబీలు రూ.400 పలుకగా, చామంతి రూ.350 కిలో చొప్పున అమ్మకాలు జరిగాయి. తామరపూలు, మొగలిచెండు, బిల్వం మార్కెట్లో కనిపించలేదు. 

Updated Date - 2021-08-20T06:01:51+05:30 IST