పండుగపూట ఉపాధ్యాయులకు షాక్‌

ABN , First Publish Date - 2021-01-14T05:23:31+05:30 IST

ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీ..

పండుగపూట ఉపాధ్యాయులకు షాక్‌

నేడు విధుల్లో చేరకపోతే నీడ్‌ స్కూల్‌ కేటాయింపు

నేడు.. రేపు మిగిలిన ఉపాధ్యాయులకు ఉత్తర్వులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. బదిలీ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు సాయంత్రమే రిలీవ్‌ అవ్వాలని, ఈ నెల 14న కొత్త పాఠశాలలో చేరాలని సూచించింది. లేదంటే ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలలో వీరి సేవలు ఉపయోగించుకుంటామని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఉపాధ్యాయులను విస్మయానికి గురి చేస్తున్నాయి. సంక్రాంతి సెలవుల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేసి ఆఘమేఘాల మీద కొత్త పాఠశాలలో చేరాలని విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడం ఉపాధ్యాయులకు మింగుడు పడటం లేదు. పాఠశాలలో చేరిన తర్వాత అపీల్స్‌ను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులు న్యాయస్థానాల తుది తీర్పునకు లోబడే ఉంటాయని పాఠశాలల విద్యాశాఖ ప్రకటించింది. 


ఈ నెల 14న స్కూల్‌ అసిస్టెంట్స్‌ అన్ని సబ్జెక్టు కేటగిరీల ఉపాధ్యాయులకు, 16వ తేదీన సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ)లకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరుగుతోంది. బదిలీ షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఆప్షన్లు ముగిసేవరకు సవరణలు మీద సవరణలు జారీ అవుతున్నాయి. మరోవైపు అప్‌గ్రెడేషన్‌, పదోన్నతి పొందినవారి స్థానాలలో కూడా బదిలీల్లో క్లియర్‌ వేకన్సీలు చూపాలని కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. 


పదోన్నతులు, అప్‌గ్రెడేషన్‌ వారితో ఖాళీలను భర్తీ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వాదనను ప్రభుత్వం పట్టించుకోలేదు. మొండిగా ముందుకెళ్లింది. అంతేగాకుండా పాఠశాలల్లో అత్యధిక స్థానాలను బ్లాక్‌చేయడంతో సీనియర్‌ సర్వీసు ఉపాధ్యాయులను మరింత గందరగోళానికి గురి చేసింది. ఇదంతా ఒక ఎత్తు కాగా, బదిలీ ఉత్తర్వులు జారీ చేసి, రిలీవ్‌ అయిన మరుసటి రోజే కొత్తపాఠశాలలో చేరాలనే షరతు విధించడంతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. 


జిల్లాలో బదిలీలకు 6,330 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తప్పనిసరి బదిలీ కావాల్సిన వారు 2,187 మంది ఉన్నారు. 4,143 మంది ఉపాధ్యాయులు రిక్వెస్టు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం బదిలీల్లో ఉపాధ్యాయులకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ పారామీటర్‌ పాయింట్స్‌ను కేటాయించింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఉపాధ్యాయులు నకిలీ సర్టిఫికెట్లు జతచేసి మంచి స్థానాలను పొందేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. అలాంటి వారి వివరాలను బహిర్గతం చేశాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ జిల్లా విద్యాశాఖ పరిశీలించింది. 


బదిలీల్లో రిలీవ్‌ అయిన పీఎస్‌హెచ్‌ఎంలు 14వ తేదీ (గురువారం) కొత్త పాఠశాలల్లో చేరాలని, రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలకు లోబడి బదిలీ ఉత్తర్వులు ఉంటాయని డీఈవో సాయిరాం తెలిపారు. త్వరలో లాంగ్వేజెస్‌, నాన్‌ లాంగ్వేజెస్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు, ఆ తరువాత ఎస్జీటీలకు బదిలీ ఉత్తర్వులు విడుదల అవుతాయని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-01-14T05:23:31+05:30 IST