శ్రీగిరిపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-12T05:50:51+05:30 IST

భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామి వెలసిన శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నిక దీక్షాయుత మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ఆరంభమయ్యాయి.

శ్రీగిరిపై సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
విద్యుత్‌ దీపాల అలంకరణ

  1. యాగశాలలో ప్రవేశించిన స్వామివారు
  2. 14న స్వామి అమ్మవార్ల లీలా కల్యాణం 
  3. రోజూ విశేష అలంకార, వాహన సేవలు


కర్నూలు (కల్చరల్‌), జనవరి 11: భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామి వెలసిన శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నిక దీక్షాయుత మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 17న పుష్య శుద్ధ చవితి వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ స్వామి, అమ్మవార్లకు విశేష అలంకార సేవలు, వాహన సేవలు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. వేడుకలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు ఆదేశాల మేరకు సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. బ్రహ్సోత్సవాల్లో 12 నుంచి ఈనెల 16 వరకు నిత్యం ఉదయం 7.30 గంటలకు చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, కలశార్చనలు, జపానుష్టానాలు, 9 గంటలకు రుద్రహోమం, నిత్యహవనములు, 10 గంటలకు బలిహరణలు, సాయంత్రం 5.30 గంటలకు సాయంకా లార్చనలు, మండపారాధనలు, పంచావరణార్చనలు, కలశార్చనలు, సాయంత్రం 6.30 బలిహరణలను ఆలయ వేద పండితులు, అర్చకులు నిర్వహిస్తారు.


వాహన సేవలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు మంగళవారం నుంచి ఈనెల 17 వరకు నిత్యం సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు  నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు విశేష అలంకార సేవలు, ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తారు.  మంగళవారం రాత్రి 7 గంటలకు భృంగి వాహన సేవ, 13న రావణ వాహన సేవ, 14న నంది వాహన సేవ, రాత్రి 8 గంటలకు పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వారి లీలా కల్యాణ మహోత్సవం, మహదాశీర్వ చనాలు, ప్రసాదాక్షత వితరణ, 15న కైలాస వాహన సేవ, 16న ఉదయం 10.45 గంటలకు పూర్ణాహుతి, రాత్రి 7.30 గంటలకు ధ్వజారోహణ, 17న అశ్వవాహన సేవ (ఆలయ ఉత్సవం), రాత్రి 8 గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ, ఆశీర్వచనం, ప్రసాద వితరణ  నిర్వహిస్తారు.  


ఆర్జిత సేవలు నిలుపుదల

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 17 వరకు దేవస్థానంలో ఆర్జిత సేవలను నిలిపేస్తున్నట్లు  ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. అయితే అభిషేకం, కుంకుమార్చనలు యఽథావిఽధిగా ఉంటాయని పేర్కొన్నారు. 13న భోగి పండుగను పురస్కరించుకొని ఐదేళ్ల వయస్సుగల చిన్నారులకు ఉచిత సామూహిక భోగిపండ్ల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా శ్రీశైలంలోని ప్రచురణల విభాగంలో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. 14న సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉంటాయని, ముందురోజున పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు. 

Updated Date - 2021-01-12T05:50:51+05:30 IST