నేటి నుంచి ఆర్‌యూలో ఆడిట్
ABN , First Publish Date - 2021-03-24T06:17:40+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం నుంచి అకౌంటెంట్ జనరల్ అడిట్ జరగనుంది.

- బిక్కు బిక్కుమంటున్న అధికారులు
- 2016 నుంచి సహకరించని వైనం
- 288 అభ్యంతరాలు
- తేలని రూ.42 కోట్ల లెక్కలు
కర్నూలు(అర్బన్), మార్చి 23: రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం నుంచి అకౌంటెంట్ జనరల్ అడిట్ జరగనుంది. యూనివర్సిటీ అధికారులు సహకరించాలని ఉపకులపతి ఏవీ ఆనందరావు ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ నిబంధల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి ఏజీ ఆడిటింగ్ జరగాల్సి ఉంది. 2008లో ప్రారంభమైన యూనివర్సిటీలో మొదటి సారిగా ఆడిట్ జరుగుతోంది. దీంతో అధికారులు, సిబ్బంది బిక్కు బిక్కుమంటున్నారు. ఏటా కొనసాగాల్సిన ఆడిట్ 2016-17 నుంచి ఆగిపోయింది. అప్పట్లోనే 288 అభ్యంతరాలు, రూ.42 కోట్లకు సంబంధించి లెక్కలు తేలలేదని ఆడిట్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత జరగాల్సిన ఆడిట్‌కు అధికారులు సహకరించలేదు. కొందరు ఉద్యోగులు తిరగబడ్డారు. ఇలా పలు కారణాలతో ఆడిట్ అటకెక్కింది. ప్రస్తుతం సెంట్రల్ ఆడిట్ కావడంతో ఎలా జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
వివాదాస్పద అంశాలు
ఆర్‌యూలో ప్రొఫెసర్ పోస్టుల నియాకాల్లో ప్రొబెషనరీ కాలం పూర్తి కాక ముందే ఉన్నత పదవులు కట్టబెట్టారని జిల్లా అడిట్ ప్రశ్నించింది.
- డిజడ్ పేలో రూ.కోట్ల నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఆ ఫైళ్లు తారుమారు చేశారని విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి.
- ఆర్‌యూ కాన్వొకేషన్‌కు అడ్వాన్సు రూపంలో తీసుకున్న డబ్బు అప్పటి రిజిస్ట్రార్ క్లియరెన్సు చేయలేదనే ఆరోపణలున్నాయి.
- యూనివర్సిటీ హాస్టల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆడిట్‌లో అభ్యంతరాలున్నాయి.
- యూజీ, పీజీ కళాశాలల నుంచి యూడీఎఫ్ ఫీజుల వసూళ్లలో యూనివర్సిటీ అధికారులు, ప్రైవేట్ కళాశాలలతో కలిసి రూ.కోట్లు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
- బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఓ ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థకు రూ.10 కోట్లు అక్రమంగా ఆడ్వాన్సు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
- పీహెచ్‌డీ పట్టాలను అడ్డగోలుగా ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
- టైం స్కేల్ ఉద్యోగుల నియామకం అక్రమంగా జరిగిందన్న విమర్శలు వచ్చాయి. ఆ ఫైలు ఉన్నత విద్యామండలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దే ఉంది. వారికి ప్రభుత్వ అనుమతి లేకుండానే సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
- చిన్న చిన్న పనులకు రూ.లక్షలు ఖర్చుపెట్టారని, భారీ ఎత్తున డబ్బు దుర్వినియోగం చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి.
ఏర్పాట్లు చేస్తున్నాం..
ఆడిట్ జరగనున్న మాట వాస్తవమే. ఏటా ఆడిట్ జరుగుతుంది. అధికారులు, సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పెద్దగా చూడాల్సిన అంశాలేవీ లేవు.
- ఏవీ ఆనందరావు, ఉపకులపతి