రౌడీ షీటర్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-03-25T05:04:00+05:30 IST

నంద్యాలలోని ఎన్‌జీవోస్‌ కాలనీ రామాలయం పక్క సందులో బుధవారం సాయంత్రం రౌడీ షీటర్‌ మారెడ్డి రాజశేఖర్‌(32) దారుణ హత్యకు గురయ్యాడు.

రౌడీ షీటర్‌ దారుణ హత్య
రాజశేఖర్‌ (ఫైల్‌)

  1. 2013లో నంద్యాల, కర్నూలులో జరిగిన జంట హత్యల కేసుల్లో నిందితుడు


నంద్యాల (నూనెపల్లె), మార్చి 24: నంద్యాలలోని ఎన్‌జీవోస్‌ కాలనీ రామాలయం పక్క సందులో బుధవారం సాయంత్రం రౌడీ షీటర్‌ మారెడ్డి రాజశేఖర్‌(32) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతికిరాతకంగా చంపడం కలకలం రేపింది. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రాముడు, రమణమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మారెడ్డి రాజశేఖర్‌ నంద్యాలలోని విశ్వనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. రాజశేఖర్‌కు ఇంకా వివాహం కాలేదు. 2013లో నంద్యాలలోని ఆనందం అపార్ట్‌మెంట్‌ లో సురే్‌షవర్మ, అతని తల్లిని దారుణంగా హత్య చేసిన కేసులో రాజశేఖర్‌ మూడో నిందితుడు. అదే సంవత్సరంలో కర్నూలు నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మైనింగ్‌ వ్యాపారి, ఆయన భార్యను హత్య చేసిన కేసులో కూడా రాజశేఖర్‌ నిందితుడు. బెయిల్‌పై బయటకు వచ్చిన రాజశేఖర్‌ నంద్యాలలో రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా ఉంటున్నాడు. సెటిల్‌మెంట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఎన్‌జీవో్‌స కాలనీ రామాలయం సెంటర్‌కు రాజశేఖర్‌ బుధవారం సాయంత్రం వచ్చాడు. ఓ ఆటోలో వచ్చిన ఐదుగురు దుండగులు రాజశేఖర్‌పై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కత్తులు, రాడ్లతో దాడి చేశారని, అనంతరం బండరాళ్ళతో తలపై మోదారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టూటౌన్‌ సీఐ కంబగిరి రాముడు, ఎస్‌ఐ పీరయ్య, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులను అడిగి హత్య గురించిన సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. 

Updated Date - 2021-03-25T05:04:00+05:30 IST