యార్డులో దోపిడీ!

ABN , First Publish Date - 2021-11-09T05:45:21+05:30 IST

అడిగే వారు లేకుంటే అందినకాడికి దోచేస్తారు. ఆదమరిచి పక్కకు వెళితే తూకంలో మాయ చేస్తారు.

యార్డులో దోపిడీ!
మార్కెట్‌లో తూకాలు వేస్తున్న హమాలీలు

  1. తూకాల్లో మోసాలు
  2. వేమెన్‌.. హమాలీల వివాదంతో బహిర్గతం
  3. భారీగా నష్టపోతున్న పత్తి రైతులు
  4. పర్యవేక్షణ మరిచిన అధికారులు


ఆదోని(అగ్రికల్చర్‌), నవంబరు 8: అడిగే వారు లేకుంటే అందినకాడికి దోచేస్తారు. ఆదమరిచి పక్కకు వెళితే తూకంలో మాయ చేస్తారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కొందరి అక్రమాలకు పత్తి రైతులు దగా పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయానికి తెచ్చిన రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఒక్కో పత్తి బోరెంలో ఐదు కేజీల నుంచి ఎనిమిది కేజీల వరకు తూకాల్లో తక్కువ చూపించి మోసగిస్తున్నారు. రాయలసీమలో పేరున్న ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరుగుతున్న తతంగం ఇది. ఇక్కడ ధరలతో పాటు తూకాల్లోనూ పారదర్శకత ఉంటుందని రైతులు నమ్ముతారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేమెన్‌ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ మార్కెట్‌ యార్డుకు చెడ్డపేరు తెస్తున్నారు. జిల్లా రైతులేగాక అనంతపురం, మహబూబ్‌నగర్‌, సిరుగుప్ప, బళ్లారి జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది రైతులు ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వచ్చి మోసపోతున్నారు. పత్తి, వేరుశనగ, ఆముదం, వాము పంట దిగుబడులను ఇక్కడికి తెస్తుంటారు. రోజు 15 వేల నుంచి 25 వేల క్వింటాళ్ల వరకు యార్డుకు విక్రయానికి రైతులు తీసుకొస్తారు. సీజన్‌లో అయితే రోజుకు 35 వేల క్వింటాళ్లకు పైగా ఉత్పత్తులు యార్డుకు వస్తుంటాయి. 


తూకాల్లో దగా 


వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తూకాల్లో మోసాలు జరగకుండా చూసేందుకు మార్కెట్‌ కమిటీ 65 మంది వేమెన్స్‌ (కాటాదారులను) ఏర్పాటు చేసింది. యార్డులో 355 పైగా దుకాణాలు ఉన్నాయి. దుకాణానికి ఐదు నుంచి పది మంది వేమెన్‌ను పంట ఉత్పత్తులను తూకం వేసేందుకు కేటాయించారు. టెండర్‌ పూర్తైన వెంటనే వారికి కేటాయించిన కమీషన్‌ ఏజెంట్‌ వద్దకు వెళ్లి తూకాలు వేయడం, రోజూ ఎన్ని క్వింటాళ్లు తూకాలు వేశారో వివరాలు నమోదు చేసి మార్కెట్‌ యార్డు కమిటీ కార్యాలయానికి అందించడం వేమెన్‌ విధులు. వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి కొందరు వేమెన్‌లు తూకాల్లో మోసం చేస్తున్నారు. రైతులను దగా చేస్తున్నారు.


ఎలకా్ట్రనిక్‌ కాటా ఉన్నా.. 


ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రంలో తొలిసారిగా ఎలకా్ట్రనిక్‌ కాటాలను ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ప్రవేశపెట్టారు. తూకాల్లో మోసాలు జరగకుండా పారదర్శకత కోసం చర్యలు తీసుకున్నారు. తూకపు రాళ్లతో అడ్డుకర్రలు పెట్టి వేసే కాటాలకు స్వస్తి పలికారు. తమ అక్రమాలు బయటపడతాయని ఎలకా్ట్రనిక్‌ కాటాలను అప్పుడు కొంత మంది వ్యతిరేకించినా అధికారులు విజయవంతంగా అమలు చేశారు. అయినా కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ కాటాలు ఏర్పాటు చేసినా, పర్యవేక్షణ లేనికారణంగా మోసాలు జరుగుతున్నాయి. 


రూ.లక్షల్లో దోపిడీ


తూకాలు వేసే సమయంలో పంట దిగుబడులు క్వింటాళ్ల కొద్దీ దోపిడీకి గురవుతున్నాయి. రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. ఒక్క రోజు పది వేల క్వింటాలు పత్తి విక్రయానికి వస్తే 500 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారు. తూకాల్లో మోసాలు జరగకుండా యార్డు అధికారులు పర్యవేక్షించాలి. కానీ మార్కెట్‌ యార్డు, తూనికలు కొలతల శాఖ అధికారులు అటు వైపు చూడడం లేదని రైతులు వాపోతున్నారు. 


వారి మధ్య గొడవతో.. 


ఈ నెల మూడో తేదీ సాయంత్రం యార్డులోని పత్తి మార్కెట్‌లో జరిగిన ఘటన అక్కడి మోసాలను బహిర్గతం చేసింది. ఓ కమీషన్‌ దుకాణం పత్తిని తూకం వేయడంలో రైతుకు అనుమానం రావడంతో వివాదం మొదలైంది. రెండోసారి తూకం వేయడంతో మోసం బయట పడింది. ఈ వ్యవహారంలో వేమెన్‌, హమాలీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని గొడవకు దిగారు. ఈ వివాదం కారణంగా తూకాల్లో జరిగిన మోసం బయటపడింది. చివరకు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమపై తప్పుడు కేసు నమోదు చేయించారని హమాలీలు సమ్మెకు దిగారు. మార్కెట్‌ యార్డు కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, చైర్మన్‌ మహబూబ్‌బాషా ఇరువర్గాల మధ్య రాజీ చేశారు. 


పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ..


తూకాల్లో మోసాలు జరగకుండా ఎలకా్ట్రనిక్‌ కాటాలను రైతుల సమక్షంలో ఉపయోగిస్తున్నాం. రైతులకు ఎలాంటి అనుమానం వచ్చినా, వెంటనే తెలియజేయవచ్చు. మోసాలు జరగకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాం. మా సిబ్బంది రోజూ తూకాలపై నిఘా ఉంచుతారు. మోసాలు జరగకుండా చూస్తారు.


- శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు కార్యదర్శి

Updated Date - 2021-11-09T05:45:21+05:30 IST