ఉద్యోగ భద్రత కోసం సీమగర్జన

ABN , First Publish Date - 2021-08-27T05:41:32+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర ఏపీ డీఎస్సీ కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగుల జేఏసీ గురువారం చేపట్టిన సీమగర్జన విజయవంతమైంది.

ఉద్యోగ భద్రత కోసం సీమగర్జన
కర్నూలులో ధర్నా నిర్వహిస్తున్న కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు

  1. కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగుల నిరసన 
  2. ఎన్నికల హామీని సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్‌


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 26: వైద్య ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర ఏపీ డీఎస్సీ కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగుల జేఏసీ గురువారం చేపట్టిన సీమగర్జన విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు కలెక్టరేట్‌ నుంచి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకులు రమణారెడ్డి (ప్రకాశం), విజయవర్ధన్‌ రెడ్డి (తూర్పు గోదావరి), విశ్వనాథరెడ్డి (కడప), రత్నాకర్‌ (ప్రకాశం), కిషోర్‌ (నెల్లూరు), చంద్రకిరణ్‌ ప్రసంగించారు. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామన్న హామీని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో క్రమబద్ధీకరణకు అర్హులను గుర్తించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఐఏఎస్‌ల కమిటీని ఏర్పాటు చేసినా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 88 రోజులుగా బాధితులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు చనిపోయారని, ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన కాంట్రాక్టు ఉద్యోగులు ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పదవీ విరమణ చేశారని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు చనిపోతే అంత్యక్రియలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో డీఎస్‌సీ కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్‌ పి.ప్రతాప్‌రెడ్డి, కో కన్వీనర్‌ బద్రి వేణుగోపాల్‌, జిల్లా కార్యదర్శులు మధుసూదన్‌ రావు, బాలయ్య, సుందర్‌, జయకుమార్‌, సురేష్‌, శేఖర్‌, ప్రతాప్‌, కిరణ్‌సింగ్‌ పాల్గొన్నారు.


ఉద్యోగ సంఘాల సంఘీభావం 


కర్నూలు సీమ గర్జనకు ఏపీజీఈఏ, ఐఎన్‌ఈయూసీ, ఏపీ హంసా, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌, సీహెచ్‌వో, ఎంపీహెచ్‌ఈవో సంఘాల నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగుల నిరసనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు ఎంసీ నరసింహులు ప్రకటించారు. రెగ్యులరేజేషన్‌ డిమాండ్‌ న్యాయమైనదని, వైద్య ఆరోగ్యశాఖలో 20 ఏళ్లుగా పని చేస్తున్న వీరు, కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించారని గుర్తు చేశారు. తక్షణమే రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2021-08-27T05:41:32+05:30 IST