సమస్యలపై స్పందించరా..?
ABN , First Publish Date - 2021-12-30T06:05:52+05:30 IST
నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ కార్పొరేటర్లు మేయర్ రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీరుపై నిరసన తెలిపారు.

- ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌పై ఆగ్రహం
- నేలపై కూర్చుని కార్పొరేటర్ మునెమ్మ నిరసన
- ఎమ్మెల్యే హఫీజ్‌తో మరో కార్పొరేటర్ వాగ్వాదం
- నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో హీట్
కర్నూలు(అర్బన్), డిసెంబరు 29: నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ కార్పొరేటర్లు మేయర్ రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీరుపై నిరసన తెలిపారు. తమ డివిజన్లలో సమస్యలను పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కార్పొరేటర్ క్రాంతి కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు 43 డివిజన్ కార్పొరేటర్ మునెమ్మ కింద కూర్చుని మేయర్, కమిషనర్ తీరుకు నిరసన తెలిపారు. రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు పాదయాత్రగా వెళతానని, తనకు జరుగుతున్న అవమానం గురించి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘ఇలా కార్పొరేటర్లు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే సీఎం జగన్ పాలనను మనమే వ్యతిరేకించినట్లు అవుతుంది. ఇది సరికాదు..’ అని మందలించారు.
ఎస్బీఐ కాలనీలోని నూతన కౌన్సిల్ హాలులో మేయర్ బీవై రామయ్య అధ్యక్షతన 4వ సర్వసభ్య సమావేశం బుధవారం రాత్రి వరకు సాగింది. అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తాగునీటి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాకు తగిన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు సూచించారు. పలుకాలనీల్లో రాత్రి 11 గంటల తర్వాత నీరు వదులుతున్నారని, అయినా చాలా కాలనీలకు నీరు అందడం లేదని విమర్శించారు. ఇప్పుడే వారానికి ఒక రోజు కూడా నీరు ఇవ్వకపోతే వేసవిలో పరిస్థితి ఏమిటని మేయర్, అఽధికారులను పలువురు కార్పొరేటర్లు నీలదీశారు.
తాగునీరు, పారిశుధ్యం, అనుమతులు, రోడ్ల నిర్మాణాలు, కార్పొరేషన్ దుకాణాల నింబధనల మార్పులు, చేర్పులు తదితర అంశాలతో కూడిన 23 తీర్మానాలను నరగ పాలక సంస్థ ఆమోదించింది.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావంత్‌కు నివాళి అర్పించారు. కర్నూలు నగరం పరిశుభ్రతలో జాతీయ స్థాయిలో 70వ ర్యాంకు సాధించినందుకు కార్పొరేటర్లతో కలిసి మేయర్, కమిషనర్, ఎమ్మెల్యేలు, అధికారులు కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేలు కాటసాని, హఫీజ్ ఖాన్, సుధాకర్, డిప్యూటీ మేయర్లు సిద్ధారెడ్డి రేణుక, నాయకల్లు అరుణ పాల్గొన్నారు.