ఇదీ బడి..!

ABN , First Publish Date - 2021-12-08T05:53:29+05:30 IST

ఈ ఫొటోలను చూడండి. పాడుబడ్డ భవంతి..

ఇదీ బడి..!

 మా బిడ్డల్ని పంపలేం

 ఎంఈవోకి తల్లిదండ్రుల తీర్మాన పత్రం


ఈ ఫొటోలను చూడండి. పాడుబడ్డ భవంతి.. ఎవరూ ఉండటం లేదేమో అనుకోకండి. ఇది ఎమ్మిగనూరు మండలం సోగనూరు మండల ప్రాథమికోన్నత పాఠశాల. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 235 మంది విద్యార్థులు ఈ బడిలో చదువుతున్నారు. 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.  కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొన్ని రోజులుగా తరగతి గదులు, వరండాలో పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో విద్యార్థులు భయాందదోళనలకు గురవుతున్నారు. మరమ్మతు చేయించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. నాడు-నేడు పథకం కింద ఇలాంటి పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఆ జాబితాలో ఈ పాఠశాలకు చోటు దక్కలేదు. భవనం దుస్థితిని చూసి తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ‘బడిలో మా బిడ్డలకు భద్రత గురించి మేము ఆందోళన చెందుతున్నాము. పాఠశాలకు మరమ్మతులు చేయించండి. లేదా కొత్త భవనం నిర్మించండి. ప్రత్యామ్నాయం చూపేవరకూ మా బిడ్డలను బడికి పంపకూడదని తీర్మానం చేశాము’ అని ఎంఈవో ఆంజనేయులకు తల్లిదండ్రులు తీర్మానం ప్రతిని అందజేశారు. పాఠశాల భవనం విషయమై కర్నూలులో ఉన్నతాధికారులను కలిశామని, డీఈవో అందుబాటులో లేకపోవటంతో టపాల్‌లో పెట్టామని ఎంఈవో తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ ఏపీసీని కలిసి సమస్యను వివరించామని, అదనపు తరగతి గదుల మంజూరుకోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారని తెలిపారు. 

- ఎమ్మిగనూరు

Updated Date - 2021-12-08T05:53:29+05:30 IST