ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు..!

ABN , First Publish Date - 2021-01-20T05:34:44+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని వైద్య కళాశాలకు కేటాయించకూడదని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు డిమాండ్‌ చేశారు.

ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు..!
ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల సంఘం నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి

నంద్యాల, జనవరి 19: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని వైద్య కళాశాలకు కేటాయించకూడదని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఇంటిని మంగళవారం ముట్టడించారు. పద్మావతినగర్‌ ఆర్చీ నుంచి ప్రదర్శనగా ఎమ్మెల్యే ఇంటి వరకు తరలి వెళ్లారు. సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌ నేతృత్వంలో భారీ సంఖ్యలో వ్యవసాయ కార్మికులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. 63 రోజులుగా ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకునేందుకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వ్యవసాయ కార్మికులు, నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే శిల్పా రవి బయటకు వచ్చి వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు, కార్మికులతో మాట్లాడారు. జీవో నెంబరు 341ని రద్దు చేయాలని, పరిశోధనా భూమిని కాకుండా వైద్య కళాశాలకు మరోచోట భూమి కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు విడుదల అయ్యేలా కృషి చేయాలని కార్మికులు ఎమ్మెల్యేని కోరారు. వైద్య కళాశాల కోసం చక్కెర ఫ్యాక్టరీ భూమిని కొనుగోలు చేయాలని, ఇందుకు అవసరమైతే పోరాడి సాధించుకునేందుకు సీఐటీయూ ముందుంటుందని నాయకులు ఎమ్మెల్యేతో అన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా మంజూరైన వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాకుండా ఇతర భూములు కొనుగోలు చేసి కేటాయించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో వ్యవసాయ కార్మికులు ఆందోళన విరమించారు. డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల సంఘం నాయకులు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-20T05:34:44+05:30 IST