చిన్నారులకు పోలియో చుక్కలు
ABN , First Publish Date - 2021-02-01T06:11:23+05:30 IST
పోలియో రహిత సమాజం అందరి బాధ్యత అని అధికారులు అన్నారు.

పోలియో రహిత సమాజం అందరి బాధ్యత అని అధికారులు అన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు అవసరమని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
నంద్యాల, జనవరి 31: పోలియో రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు సాగాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి సూచిం చారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా రామకృష్ణ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ దేశ వ్యాప్తం గా పల్స్ పోలియో నిర్వహణలో భాగంగా నంద్యాల డివిజన్ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి రోజు పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాల రోటరీ క్లబ్ ప్రధాన శాఖ అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆత్మకూరు బస్టాండ్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. క్లబ్ ఇన్నర్‌విల్ చైర్మన్ వనజ, అధ్యక్షురాలు ఈశ్వరి, కార్యదర్శి నాగమల్లేశ్వరి, సుశీల, డాక్టర్ హరిత, సీనియర్ రోటేరియన్లు సుబ్బరామయ్య, రాజశేఖర్, కైలాస్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
నంద్యాల (ఎడ్యుకేషన్): నంద్యాల పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. 27,515 చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 26,298 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు ప్రోగ్రాం ఆఫీజర్ డాక్టర్ సునీత తెలిపారు.
పాణ్యం: మండలంలో 90 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్ భగవాన్‌దాస్ తెలిపారు. మండలంలో 4,300మంది చిన్నారులుండగా 3,900 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. డాక్టర్ మల్లికార్జునరెడ్డి, ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీశైలం: శ్రీశైలం మండలంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో మెత్తం 27 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసినట్లు శ్రీశైలం ప్రాథమిక వైద్యశాల వైద్యుడు డాక్టర్ సోమశేఖర్ తెలిపారు. దాదాపు 97 శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. దేవస్థానం ఈవో కేఎస్ రామరావు, డా. శ్రవంతి, సీహెచ్‌వో రంగయ్య, పీహెచ్‌ఎన్ ధనలక్ష్మి, హెచ్‌ఎన్ నారమ్మ పాల్గొన్నారు.