జేసీకి మొరపెట్టుకున్న దివ్యాంగురాలు

ABN , First Publish Date - 2021-12-08T05:13:23+05:30 IST

మూడు నెలల క్రితం పింఛన్‌ తొలగించారని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఓ దివ్యాంగురాలు జేసీ (అభివృద్ధి) మనజీర్‌ జిలానీ సామూన్‌ వద్ద మొర పెట్టుకున్నారు.

జేసీకి మొరపెట్టుకున్న దివ్యాంగురాలు
జేసీకి మొర పెట్టుకుంటున్న దివ్యాంగురాలు

కోడుమూరు(రూరల్‌), డిసెంబరు 7: మూడు నెలల క్రితం పింఛన్‌ తొలగించారని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఓ దివ్యాంగురాలు జేసీ (అభివృద్ధి) మనజీర్‌ జిలానీ సామూన్‌ వద్ద మొర పెట్టుకున్నారు. వర్కూరుకు చెందిన బ్రహ్మవేణి అనే దివ్యాంగురాలు కోడుమూరు ఎంపీడీవో కార్యాలయం వద్దకు తల్లితో పాటు వచ్చింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్న జేసీ బయటకు వస్తూ దివ్యాంగురాలిని ఆరా తీశారు. దీంతో ఆ దివ్యాంగురాలు బ్రహ్మవేణి మాట్లాడుతూ పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పైగా అవమానకర రీతిలో మాట్లాడుతున్నారని అధికారులపై ఫిర్యాదు చేశారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ ఎంపీడీవో మంజులవాణితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏమిటో పరిష్కరించి పింఛన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 


 పాఠాలు బోధించిన జేసీ


కోడుమూరులోని జీవీఆర్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను జేసీ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆకస్మికంగా తనిఖీ చేసిన చేశారు. ముందుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, టాయిలెట్లను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను తనిఖీ చేస్తూ 10వ తరగతి గదిలో ప్రవేశించారు. సైన్స్‌ ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు వేస్తూ వివిధ అంశాలపై వివరిస్తూ పాఠం కొనసాగించారు. విద్యార్థుల సమాధానాలకు జేసీ వెరీ గుడ్‌ అంటూ పాఠశాల గది నుంచి బయటకు వచ్చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజులవాణి, హెచ్‌ఎం శ్రీనివాసయాదవ్‌ పాల్గొన్నారు. 


 చెత్త సంపద కేంద్రం తనిఖీ  


కోడుమూరు మండలంలోని లద్దగిరిలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జేసీ మనజీర్‌ జిలాని సామూన్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రీన్‌ అంబాసిడర్లతో మాట్లాడారు. అలాగే గ్రామంలో పీహెచ్‌సీ, అంగన్‌వాడీ  కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అంతకుముందు ఆయన మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయితీ కార్యదర్శులు, వీఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై కృషి చేస్తూ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రూతమ్మ, జడ్పీటీసీ రఘునాథరెడ్డి పాల్గొన్నారు

Updated Date - 2021-12-08T05:13:23+05:30 IST