పెట్రో ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-29T05:08:03+05:30 IST

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని వాపమక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరలు తగ్గించాలి
నంద్యాలలో రాస్తారోకో చేస్తున్న వామపక్ష నాయకులు

  1. వామపక్షాల ఆందోళన


నంద్యాల టౌన్‌, అక్టోబరు 28: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని వాపమక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం నూనెపల్లెలోని కోవెలకుంట్ల జంక్షన్‌లో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎం ఎల్‌ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకులు రమేశ్‌కుమార్‌, నాగరాజు, మస్తాన్‌వలి, సీపీఐ నియోజకవర్గ నాయకుడు బాబాఫకృద్దీన్‌, సీపీఐ ఎంఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు శంకర్‌ మాట్లాడారు. పెంచిన ధరలతో ప్రజా జీవనం అస్తవ్యస్తమైందని అన్నారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ పన్ను ఎగవేతదారులకు 6లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయడం చూస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బడాబాబులకు ఊడిగం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నదని అన్నారు. వామపక్ష నాయకులు లక్ష్మణ్‌, నరసింహ, సద్దాం హుసేన్‌, తోటమద్దులు, శ్రీనివాసులు, ప్రసాద్‌, గౌస్‌ పాల్గొన్నారు.


ఓర్వకల్లు: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర ధరలను తగ్గించాలని సీపీఎం నాయకుడు రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. గురువారం ఓర్వకల్లులో సీపీఎం రాష్ట్ర  కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ బస్టాండు తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా నిరసనా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్‌ నాగన్న అధ్యక్షత వహించారు. సీపీఎం జిల్లా నాయకుడు రామకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకుడు పులిశేఖర్‌ హాజరై  మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌ నిత్యావసర ధరలను ప్రతిరోజూ పెంచుతూ ప్రజల నడ్డీ విరుస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.70 ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతం రూ.115, 106లు వరకు పెంచారని  వాపోయారు. వెంటనే ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షుడు శ్రీధర్‌, రైతు సంఘం నాయకులు మధుసూదన్‌, సుధాకర్‌, అక్బర్‌బాషా, చాంద్‌బాషా, మల్లేష్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-29T05:08:03+05:30 IST