పెట్రో ధరలు తగ్గించాల్సిందే
ABN , First Publish Date - 2021-10-29T05:22:41+05:30 IST
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు.

- లేకుంటే ఆందోళన తీవ్రతరం
- వామపక్షాల అల్టిమేటం
కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 28: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం నగరంలోని సుందరయ్య కూడలి, కలెక్టరేట్, బళ్లారిచౌరస్తా, దిన్నెదేవరపాడు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసనలో సీపీఎం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ధరలను అడ్డుఅదుపూ లేకుండా పెంచుతోందన్నారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగసంస్థలను కూడా కారుచౌకగా అమ్ముతోందని ధ్వజమెత్తారు. దేశంలో ఆదానీ, అంబానీ అస్తులు పెరుగుతున్నాయని, కానీ పేదవాడికి తిండిదొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగితే ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరుగుతాయని, తద్వారా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని అయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్, కేసీసీఐ జిల్లా నాయకుడు హరీష్, సీపీఐ నాయకుడు ఎస్‌ఎన్ రసూల్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామక్రిష్ణ, ఇరిగినేని పుల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్, మిన్నల్ల, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదోనిలో మున్సిపల్ గ్రౌండ్ నుంచి భీమాస్ కూడలి వరకు వామపక్షాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకటేశులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా భారాలు మోపుతున్నాయన్నారు.
నంద్యాల నూనెపల్లెలోని కోవెలకుంట్ల జంక్షన్‌లో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మోదీ ప్రభుత్వ దుర్మార్గ విధానాలపై ప్రజా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఎమ్మిగనూరులోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో వామపక్షాల నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆటోను, ఎద్దులబండిని సోమప్ప సర్కిల్ వరకు లాగి నిరసన వ్యక్తం చేశారు.