సామాన్యుడిపై పెట్రో బాంబు
ABN , First Publish Date - 2021-02-26T05:42:39+05:30 IST
నిప్పు రాజేయకనే పెట్రోల్, డీజిల్ భగ్గున మండిపోతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న చమురు ధరలతో సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు.

- 15 రోజుల్లో లీటరుపై రూ.10 పెంపు
- సగం ఆదాయం ఇంధనానికే ఖర్చు
- ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి
కర్నూలు-ఆంధ్రజ్యోతి: నిప్పు రాజేయకనే పెట్రోల్, డీజిల్ భగ్గున మండిపోతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న చమురు ధరలతో సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. చమురు సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఇంధన ధరలకు అదుపు లేకుండా పోతోంది. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలకు చేరువ అయ్యాయి. పవర్ పెట్రోల్ వంద దాటేసింది. జిల్లాలో లీటరు పెట్రోలు రూ.97.31, డీజిల్ రూ.90.90కి చేరుకుంది. పవర్ పెట్రోల్ రూ.100.76కు చేరింది. ఈ ధరలు చూశాక వాహనాన్ని బయటకు తీయాలంటేనే సామాన్యుడు భయపడిపోతున్నాడు. కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల్లో సంపాదన పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు పెరుగుతున్న పెట్రో ధరలు ప్రభావం నిత్యావసరాలపై పడుతోంది. ధరల దెబ్బకు మధ్య పేద, మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నాడు. వచ్చే ఆదాయంలో సగం పెట్రోల్, గ్యాస్‌కే పోతే ఇంటిల్లిపాది ఏం తిని బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో కార్పోరేట్లకు మాత్రమే మేలు చేసే ప్రభుత్వాలు సగటు ప్రజల గురించి ఒకసారి ఆలోచించాలని సూచిస్తున్నారు.
రోజూ బాదుడే..
పెట్రోల్, డీజిల్ ధరలపై అగ్రిసెస్ ప్రభావం ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత రోజూ ఇంధనం ధరలు పెరుగు తూనే ఉన్నాయి. చమురు సంస్థలు రోజుకు కొన్ని పైసల చొప్పున పెంచుకుంటూ పోతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై ఏకంగా రూ.10 పెరిగాయి. ఫిబ్రవరి 5న రాష్ట్రంలో రూ.86.95 ఉన్న లీటరు పెట్రోల్ ధర ఈ నెల 23వ తేదీ నాటికి రూ.97 దాటింది. డీజిల్ ధర రూ.83 నుంచి రూ.90కి చేరింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నందునే ఇక్కడా పెంచాల్సి వస్తోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినపుడు ఆ ప్రయోజనాన్ని తమకు అందించడం లేదని, పెరిగిన ధరల భారం మాత్రం ఎందుకు మోపుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
వాహనదారుల మండిపాటు
ఒకపుడు సైకిలే సామాన్యుడి వాహనం. కానీ మారిన పరిస్థితుల దృష్టా బైక్ సామాన్యుడి వాహనమైంది. కుటుంబం నెలవారీ ఖర్చుల్లో పెట్రోల్ ఖర్చు కూడా కలిసిపోయి చాలా కాలమైంది. సాధారణ, మధ్య తరగతి కుటుంబానికి పెట్రోల్ ఖర్చు నెలకు ఎంత లేదన్న రూ.1500 నుంచి రూ.2 వేలు అవుతోంది. ధరల పెరుగుదలతో ఈ ఖర్చు మూడు వేలను మించుతోంది. దీంతో నిత్యావసరాలు కొనలేకపోతున్నామని, కుటుంబాలు గడవటం కష్టమౌతోందని వాపోతున్నారు.
ఆటోలతో ఉపాధి పొందుతున్నవారి పరిస్థితి దారుణంగా మారింది. పెరిగిన డీజిల్ ఖర్చుతో ఆదాయం తగ్గిపోతోందని, సర్వీసు రేట్లు పెంచెతే ఆటో ఎక్కేవారు ఉండరని అంటున్నారు. రోజంతా తిప్పితే మూడు నుంచి అయిదు వందలు వస్తాయని, ఇపుడు ఆ మిగులులో మరో వంద రూపాయలు ఇంధనానికి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆటోలను నమ్ముకుని లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు.
నడిచి వెళ్ళాలేమో..
ద్విచక్ర వాహనం లేనిదే పని నడవదు. బండి ఉంటే ఏ మూలకైనా వెళ్ళి రావచ్చు. రోజూ బండి బయటకు తీయాల్సిందే.. పెట్రోల్ వేయించాల్సిందే! ఇలా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే సామాన్యులకు ఇబ్బం దులు తప్పవు. ఇంతకు ముందు వంద రూపాయల పెట్రోలు వేయిస్తే రెండ్రోజులకు సరిపో యేది. ఇపుడు రోజూ వంద రూపాయలు ఖర్చు చేసినా సరిపోవడం లేదు. ఇంధనం ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగితే వాహనాలను అమ్ముకుని కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. - అరవింద్, ద్విచక్ర వాహనదారు, కర్నూలు
ఆటో నడపలేం
పొద్దున్నే ఆటో బయటకు తీయాలంటే భయమేస్తోంది. ఇంతకు ముందు రోజుకు రూ. 150 పెట్రోల్ వేయిస్తే రూ.500 నుంచి రూ.700 వరకు వచ్చేది. ఇప్పుడు రూ.300 వేయించాల్సి వస్తోంది. రోజూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల వల్ల వచ్చే ఆదాయంలో సగం ఆటో ఖర్చులకే సరిపోతోంది. భార్యా, పిల్లల్ని ఏం పెట్టి పోషించాలి..? పెరిగిన ధరలకు అనుగుణంగా సర్వీసు రేట్లు పెంచలేం. అలా చేస్తే ఎవరూ ఎక్కరు. వచ్చే నాలుగు రూపాయలు కూడా రావు. ఆటో నడప లేక, వేరే పని దొరకక నలిగి చస్తున్నాం. ప్రభుత్వాలు చమురు ధరలు పెంచేటపుడు ఆలోచిస్తే బాగుంటుంది.- అబ్రహాం, ఆటో డ్రైవర్, కర్నూలు
సగం ఆదాయం పోతోంది..
ఎవరైనా కూలి పనులకు పిలిస్తే కాలినడకన వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని అప్పు చేసి బైక్ కొన్నాం. అడ్డా మీదకు రావడానికి రూ.వంద పెట్రోల్ వేయించాల్సిందే! కరోనా కారణంగా ఇంతకు ముందు లాగా పనులు దొరకడం లేదు. బండి వాయిదాలు కట్టడానికే ఇబ్బంది పడుతున్నాం. రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో మరింత ఇబ్బంది అవుతోంది. వచ్చే ఆదాయంలో సగం పెట్రోల్‌కే పోతే ఎలా బతికేది..? - పుల్లన్న, రోజు కూలీ, కర్నూలు
నేడు పెట్రోలు బంకుల ముందు నిరసనలు
కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 25: పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం పెట్రోలు బంకుల ముందు ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం సుందరయ్య భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పెట్రోలు బంకుల ముందు చేపట్టే నిరసనలో ప్రజలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు రామాంజనేయులు, రాధాకృష్ణ, నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు.