పాలన చేతకాకే కక్ష సాధింపు

ABN , First Publish Date - 2021-12-25T06:09:41+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి పాలన చేతకాక చేతులెత్తేసి, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు తెగబడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ ధ్వజమెత్తారు.

పాలన చేతకాకే కక్ష సాధింపు

  1. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు
  2. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌


నంద్యాల టౌన్‌, డిసెంబరు 24:  వైసీపీ ప్రభుత్వానికి పాలన చేతకాక చేతులెత్తేసి, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు తెగబడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం నంద్యాల మదరస-అరబియా-దారుల్‌ అమన్‌ను రక్షించాలని, అవినీతి మైనార్టీ సంక్షేమశాఖ అధికారులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ మైనార్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ దీక్షకు పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  ఫరూక్‌ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మైనార్టీ విద్యార్థులకు అప్పట్లో చేపట్టిన విదేశీ విద్య, దుల్హన్‌ పథకం కింద ఆర్థిక సాయంలాంటి ఎన్నో పథకాలు ప్రస్తుతం అగుపించడంలేదని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను దర్జాగా ఆక్రమించి అనుభవిస్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా, వక్ఫ్‌బోర్డుకు లీజ్‌ చెల్లిస్తూ మదరసా నిర్వహిస్తున్నవారిపై రాజకీయ కక్షతో దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. మదరసాను సీజ్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. దౌర్జన్యాలు, అక్రమకేసులకు భయపడేదిలేదని అన్నారు. పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులను టార్గెట్‌ చేసి వైసీపీ నాయకులు ఆడుతున్న గేమ్‌లో  మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు పడొద్దని అన్నారు. రైతునగర్‌లో వక్ఫ్‌భూమి ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మదరసాను అన్యాయంగా సీజ్‌ చేశారని, ఖురాన్‌ విద్యను అభ్యసించే విద్యార్థులను రోడ్డున పడేయడం దుర్మార్గమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మాబువలి, నాగార్జున, నాయకులు గోవిందనాయుడు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-25T06:09:41+05:30 IST