పాలకవర్గం, అధికారుల మధ్య వివాదం

ABN , First Publish Date - 2021-05-30T05:52:30+05:30 IST

పాలకవర్గం సూచన మేరకు పూణె నుంచి ఉల్లితో వచ్చిన రెండు లారీలను కర్నూలు మార్కెట్‌యార్డు బయటే అధికారులు ఆపేశారు.

పాలకవర్గం, అధికారుల మధ్య వివాదం
మార్కెట్‌ బయటే ఉన్న ఉల్లి లారీలు

కర్నూలు (అగ్రికల్చర్‌),  మే 29: పాలకవర్గం సూచన మేరకు పూణె నుంచి ఉల్లితో వచ్చిన రెండు లారీలను కర్నూలు మార్కెట్‌యార్డు బయటే అధికారులు ఆపేశారు. ఇక్కడి రైతులు తెచ్చిన ఉల్లికే డిమాండ్‌ లేదని, పూణె నుంచి వ్యాపారులు ఎలా తెప్పిస్తారని ప్రశ్నించారు. కొంతకాలంగా మర్కెట్‌ యార్డులో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు ఫిర్యాదు చేయడంతో పాలకవర్గం విచారణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శనివారం మహారాష్ట్రలోని పూణె నుంచి స్థానిక వ్యాపారులు తెప్పించిన రెండు లారీల ఉల్లిని గుర్తించిన పాలకవర్గం ఆ లారీలను మార్కెట్‌ యార్డులోనికి అనుమతించలేదు. స్థానిక రైతులు తెచ్చిన ఉల్లికే డిమాండ్‌ లేదని, ఈ పరిస్థితుల్లో బయటి రాష్ట్రాల ఉల్లిని వ్యాపారులు తెస్తుంటే.. ఎలా అనుమతిస్తారని అధికారులను నిలదీశారు. సహాయ సెక్రటరీ సుబ్బారెడ్డి పాలకవర్గం సభ్యులకు వివరణ ఇస్తూ స్థానిక రైతుల నుంచి ఉల్లి తగినంతగా రాకపోవడం వల్ల వ్యాపారులు పూణె నుంచి ఉల్లిని తెప్పించుకుంటున్నారని, సెస్‌ను కడుతున్నారని సమాధానమిచ్చారు. దీంతో సంతృప్తి చెందని వైస్‌ చైర్మన్‌ రాఘవేంద్ర రెడ్డి, డైరెక్టర్లు, ఉల్లి లారీలను మార్కెట్‌లోనికి అనుమతించవద్దని చెప్పడంతో అధికారులు వాటిని యార్డు బయటే నిలిపివేశారు. ఎంతో కాలంగా స్థానిక వ్యాపారులు పూణెనుంచి ఉల్లిని తీసుకువస్తూ, సెస్‌ కూడా సక్రమంగా చెల్లించడం లేదని, దీనివల్ల మార్కెట్‌ కమిటీ ఆదాయానికి గండి పడుతోందని, స్థానిక రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని పాలక వర్గం సభ్యులు అధికారులపై మండిపడ్డారు. మొత్తానికి మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ఉల్లిని లారీల్లో తెప్పించడం అధికారులు, పాలకవర్గం సభ్యుల మధ్య చిచ్చు రేపింది. 


 సోమవారం విచారణ


రైతుల నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డులోని వ్యాపారులు ప్రతిరోజు కూరగాయలను కొనుగోళ్ళు చేస్తుంటారు. ప్రభుత్వం ఈ కొనుగోళ్లపై ఎటువంటి కమీషన్‌ వసూలు చేయరాదని గతంలోనే జారీ చేసింది. అయితే వ్యాపారులు 10-15 శాతం కమీషన్‌ను వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొన్ని రోజుల క్రితం రైతులు కమిటీ చైర్మన్‌ రోఖియాబితో పాటు వైస్‌ చైర్మన్‌ రాఘవేంద్రరెడ్డి, డైరెక్టర్‌ మాహబూబ్‌ బాషాకు మొరపెట్టుకున్నారు. వారం రోజుల నుంచి పాలకవర్గం సభ్యులు రాత్రి సమయంలో జరిగి కూరగాయల కొనుగోళ్లపై యార్డుల్లోకి స్వయంగా వెళ్లి విచారణ చేశారు. రైతుల ఫిర్యాదులో వాస్తవం ఉందని, వ్యాపారులు అక్రమంగా కమీషన్‌ వసూలు చేస్తూ రైతులకు ఇచ్చే చీటీల్లో కూడా నమోదు చేస్తున్నట్లు తేలిందని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు విలేకరులకు తెలిపారు. సోమవారం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయని అధికారులపైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామన్నారు. రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్న కమీషన్‌ వ్యాపారులపై చర్యలు ఉంటాయని చైర్మన్‌, డైరెక్టర్లు స్పష్టం చేశారు. ఉల్లిగడ్డల ప్లాట్‌ఫారంపై కొంతమంది వ్యాపారులు ఎలాంటి అనుమతి లేకుండా మహారాష్ట్ర నుంచి బంగాళాదుంపలను తీసుకువచ్చి ఇక్కడే విక్రయిస్తున్నట్లు రైతుల ఫిర్యాదు చేశారని, ఈ అంశంపై కూడా విచారణ చేస్తామని డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా తెలిపారు. 


 వాముకొట్టు నిల్వలపైనా విచారణ


జిల్లా మార్కెట్‌ యార్డులో కొంతమంది వ్యాపారులు వాము కొట్టును భారీ స్థాయిలో నిల్వ చేస్తున్నందు వల్ల రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నట్లు పాలకవర్గం దృష్టికి వచ్చింది. వ్యాపారులు అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్ల ఈ వ్యవహారం కొనేళ్ల నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నట్లు తెలిసిందని పాలకవర్గం సభ్యులు తెలియజేశారు. కొంతమంది వ్యాపారులు వాముకొట్టు ముసుగులో వాము బస్తాలను నిలువ చేసి, మార్కెట్‌ కమిటీ సెస్‌ చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటన్నింటి పైన విచారణ జరిపిస్తామన్నారు.


 చిచ్చు రేగింది


కొంతకాలంగా పాలకవర్గం, మార్కెట్‌ కమిటీ అధికారుల మధ్య యార్డులో జరుగుతున్న వ్యవహారాలపై వివాదం చెలరేగుతోంది. ఎన్నోసార్లు ఈ విషయాలపై అధికారులను పాలకవర్గం సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం. యార్డులో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయిలో త్వరలోనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌కు నివేదికను పంపనున్నట్లు పాలకవర్గం సభ్యులు తెలిపారు.


విచారించి చర్యలు తీసుకుంటాం 


ఇటీవల రైతుల నుంచి ఉల్లిగడ్డల విక్రయానికి కర్నూలు యార్డుకు రావడం తగ్గిపోయింది. దీంతో వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లిని జిల్లా యార్డుకు దిగుమతి చేసుకుంటున్నారు. సెస్‌ కూడా వారి నుంచి వసూలు చేస్తున్నాం. అక్రమాలను మా దృష్టికి తీసుకువస్తే వాటిపై విచారణ జరుపుతాం.  వ్యాపారులపై, కమీషన్‌ ఏజెంట్లపై తగిన చర్యలు తీసుకుంటాం.


- జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ

Updated Date - 2021-05-30T05:52:30+05:30 IST