‘ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు’
ABN , First Publish Date - 2021-07-24T06:05:07+05:30 IST
నిరుద్యోగులవి ఆత్మహత్యలు కాదని.. ఇవి ప్రభుత్వ హత్యలే అని విద్యార్థి, సంఘాల నాయకులు మండిపడ్డారు.

కర్నూలు(ఎడ్యుకేషన్/న్యూసిటీ), జూలై 23: నిరుద్యోగులవి ఆత్మహత్యలు కాదని.. ఇవి ప్రభుత్వ హత్యలే అని విద్యార్థి, సంఘాల నాయకులు మండిపడ్డారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వల్ల తమకు ఉద్యోగాలు రావని మనస్తాపంతో జిల్లాలోని గూడూరు మండలం చనుగొండ్ల గోపాల్, పర్ల గ్రామంలోని రమేష్, ప్యాపిలి మండలం నాగేంద్రప్రసాద్, పాతబస్తీలో నివాసముంటున్న కోడుమూరుకు చెందిన ఏల్లేశ్వరి అనే నలుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, వెంకటేష్, అబ్దుల్లా, చంద్రశేఖర్, రమేష్, రాఘవేంద్ర, రవితేజ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.