ప్రశాంతంగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-05T06:05:21+05:30 IST

కర్నూలు మండలంలోని రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌లు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.

ప్రశాంతంగా నామినేషన్లు

 కర్నూలు(రూరల్‌), ఫిబ్రవరి 4: కర్నూలు మండలంలోని రెండో  దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌లు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఆఖరి రోజుకావడంతో అభ్యర్థులు నామినేషన్‌లు వేసేందుకు బారులు తీరారు.  23 గ్రామ పంచాయతీలో చాలా మంది అభ్యర్థులు  సర్పంచ్‌ స్థానానికి రెండేసి చొప్పున  నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మండలంలో 23 గ్రామ పంచాయతీలకు గాను  సర్పంచు నామినేషన్ల 108 రాగా, 259 వార్డులకు గాను 471 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు.  మండలంలో ఎనిమిది చోట్ల నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అందులో శివరామపురం, దిగువపాడు గ్రామాలు కలిపి గార్గేయపురం పంచాయతీ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో శివరాంపురం లో సర్పంచు స్థానానికి  ఒకే ఇంటి నుంచి ఇద్దరే నామినేషన్‌ వేయడంతో దాదాపు ఆ స్థానం ఏకగ్రీవం కానుంది. పి.రుద్రవరం, దిన్నెదేవరపాడు అభ్యర్థులు దిన్నెదేవరపాడులో, బి.తాండ్రపాడు, ప్రజానగర్‌ అభ్యర్థులు బి.తాండ్రపాడులో,   పసుపల, సూదిరెడ్డిపలె, నూతనపల్లె, పడిదెంపాడు, నందనపల్లె, భూపాల్‌నగర్‌, వెంకాయపల్లె అభ్యర్థులు నందనపల్లెలో  నామినేషన్లు  దాఖలు చేశారు. బసవాపురం, నిడ్జూరు, తొలిశాపురం, జి.సింగవరం అభ్యర్థులు జి.సింగవరం కొత్తకాలనీలో,  ఎదురూరు, దుద్యాల, కొంతలపాడు, సుంకేసుల అభ్యర్థులు సుంకేసులలో నామినేషన్లు సమర్పించారు. పంచలింగాల, ఈ.తాండ్రపాడు అభ్యర్థులు ఈ.తాండ్రపాడులో,  గొందిపర్ల, దేవమాడ, వసంత్‌నగర్‌ గ్రామాల అభ్యర్థులు గొందిపర్ల సచివాయలంలో నామినేషన్లు వేశారు.  


కర్నూలు(కలెక్టరేట్‌): కల్లూరు మండలంలో నామినేషన్ల పర్వం ముగిసింది. మండలంలో 18 సర్పంచ్‌ స్థానాలకు 98 నామినేషన్లు దాఖలు కాగా, 186 వార్డు సభ్యుల స్థానాలకు 410 నామినేషన్‌లు దాఖలయ్యాయి. మొదటి రెండు రోజుల్లో సర్పంచ్‌ స్థానాలకు 39, వార్డు సభ్యుల స్థానాలకు 146 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. చివరిరోజైన గురు వారం ఒక్కరోజే 323 నామినేషన్లు దాఖలయ్యాయి. మండల పరిధిలో 20 వార్డు సభ్యుల స్థానాలకు సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి.  రెండవ దశ నామినేషన్లకు చివరి రోజు కావడంతో మండలంలో 5 నామినేషన్‌ క్లస్టర్ల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపించింది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్న అభ్యర్థుల నుంచి రాత్రి 9.30 వరకు నామినేషన్‌లను స్వీకరించారు. ఇలా వచ్చిన నామినేషన్లను ఆర్వోలు నేడు పరిశీలిస్తారు. అర్హత లేని వాటిని తిరస్కరిస్తారు. ఇలాంటి నామినేషన్‌ల అభ్యంతరాలపై ఫిబ్రవరి 6 వ తేదీన ఆర్‌డీవోల వద్దకు అప్పీలకు అభ్యర్థి వెళ్ల వచ్చు. 7వ తేదీన అభ్యంత రాలపై ఆర్వోడీవోలు తుది నిర్ణయం తెలియజేస్తారు. 8వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ, బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. 


 రెండు ఏకగ్రీవం

సి.బెళగల్‌: మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో రెండు  ఏకగ్రీవం అయ్యాయి. శింగవరం గ్రామ పంచాయతీకి రవీంద్రరెడ్డి, ఈర్లదిన్నె గ్రామ పంచాయతీకి మల్లేపోగు పెద్దక్క ఏకగ్రీవమయ్యారని  ఎంపీడీవో రాముడు తెలిపారు.  మిగతా 16 గ్రామ పంచాయతీల్లోని  సర్పంచ్‌ స్థానాలకు 113 నామినేషన్లు, వార్డు స్థానాలకు 576 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో తెలిపారు. 

Updated Date - 2021-02-05T06:05:21+05:30 IST