గోదాములో మిర్చి దగ్ధం

ABN , First Publish Date - 2021-05-20T05:39:29+05:30 IST

గిట్టుబాటు ధర వచ్చాక అమ్ముకుందామని గోదాముల్లో దాచిన బ్యాడిగ మిరప నిల్వలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

గోదాములో మిర్చి దగ్ధం
బళ్లారిలో జయంతి గోడౌన్‌లో మిర్చి కాలుతున్న దృశ్యం

  1. రూ.22 కోట్లు నష్టపోయిన రైతులు
  2. బళ్లారిలోని ప్రైవేటు గోదాములో ప్రమాదం


చిప్పగిరి, మే 19: గిట్టుబాటు ధర వచ్చాక అమ్ముకుందామని గోదాముల్లో దాచిన బ్యాడిగ మిరప నిల్వలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మండలంలోని ఏరూరు, చిప్పగిరి, డేగులపాడు, ఖాజీపురం, బంటనహాల్‌, గుమ్మనూరు గ్రామాలకు చెందిన వందలాది మంది బళ్లారిలోని ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ జయంతి కోల్డ్‌ స్టోరేజీ గోడౌన్లలో మిరప దిగుబడులను నిల్వ చేశారు. ఏరూరు రైతులు ఎనిమిది మంది, 800 క్వింటాళ్ల బ్యాడిగ మిరపను అక్కడే దాచారు. ఈ నెల 16న గోదాముకు నిప్పు అంటుకుంది. దీంతో దాదాపు సగం దిగుబడులు దగ్ధమయ్యాయి. మార్కెట్‌లో బ్యాడిగ మిరప క్వింటం రూ.25 వేలు పలుకుతోంది. ఈ లెక్కన చిప్పగిరి మండల  రైతులు రూ.22 కోట్లకు పైగా నష్టపోయారు. ఎకరానికి రూ.30 వేలు కౌలు చెల్లించామని, అప్పు చేసి రూ.లక్షలు పెట్టుబడి పెడితే ఇలా జరిగిందని రైతులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, గోదాము యజమానులతో మాట్లాడి బీమా సొమ్ము ఇప్పించాలని కోరుతున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి..

బళ్లారి జయంతి గోడౌన్‌లో మిరప దగ్ధమై నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ గోడౌన్‌లో ఏరూరుకు చెందిన 8 మంది రైతులు దాచిన 800 క్వింటాళ్లు బ్యాడిగ మిర్చి కాలిపోయింది. నేను కూడా 200 క్వింటాళ్ల మిరపను అక్కడే నిల్వ చేశాను. మొత్తం కాలిపోయింది. రూ.50 లక్షలకు పైగా నష్టపోయాను. 

- తిమ్మాపురం జయన్న, ఏరూరు


Updated Date - 2021-05-20T05:39:29+05:30 IST