గొర్రెల సంత, కబేళా తరలింపునకు చర్యలు

ABN , First Publish Date - 2021-06-23T05:08:19+05:30 IST

పట్టణంలోని జనావాసాల మధ్య ఉన్న గొర్రెల సంత, కబేళా తరలింపునకు చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ నాగరాజు అన్నారు.

గొర్రెల సంత, కబేళా తరలింపునకు చర్యలు
కబేళాను పరిశీలిస్తున్న మున్సిపల్‌ ఆర్‌డీ నాగరాజు

పురపాలక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ నాగరాజు 

ఆదోని(అగ్రికల్చర్‌), జూన్‌ 22: పట్టణంలోని జనావాసాల మధ్య ఉన్న గొర్రెల సంత, కబేళా తరలింపునకు చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ నాగరాజు అన్నారు. పట్టణంలోని బొబ్బులమ్మ అవ్వ దేవాలయం వద్ద జరిగే గొర్రెల వారపు సంత, కబేళా తీవ్ర అసౌకర్యంగా ఉందని రెండు నెలల కిందట బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజుగౌడ్‌ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి పూర్తి నివేదిక సమర్పించాలని పురపాలక శాఖను ఆదేశించారు. మంగళవారం విచారణ అధికారిగా పురపాలక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ నాగరాజు ఆదోనిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుపై సమగ్రమైన నివేదికను లోకాయుక్తలో సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అసౌకర్యంగా ఉన్న గొర్రెల సంతను ఖాళీగా ఉన్న ఊరిబయట ప్రభుత్వ స్థలంలోకి తరలించేలా నివేదికలు తయారు చేశామని చెప్పారు. సంతపేట, అరుణ్‌జ్యోతి నగర్‌లో వేసిన సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకురాగా పూర్తి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని ఆర్డీ చెప్పారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, సహాయ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు లక్ష్మీకాంత్‌, సురేష్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

    పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో జరిగే అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి నాగ రాజుగౌడ్‌ కోరారు. మంగళవారం ఆదోనికి వచ్చిన ఆర్‌డీ నాగరాజును కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకు లు లక్ష్మీకాంత్‌, నారాయణ, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-23T05:08:19+05:30 IST