ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..

ABN , First Publish Date - 2021-06-23T05:10:00+05:30 IST

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు ఆ యువతిని మోసం చేశాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు.

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..
మహిళా సంఘం నాయకురాలితో ప్రియుడి ఇంటి వద్ద యువతి

న్యాయం చేయాలంటూ బాధితురాలి వేడుకోలు

ఆదోని, జూన్‌ 22: ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు ఆ యువతిని మోసం చేశాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు మంగళవారం ప్రియుడి ఇంటికి వెళ్లి నిలదీయగా అతడి బంధువులు ఆమెపై దాడి చేశారు. బాధితురాలి కథనం మేరకు.. విశాఖపట్నం జిల్లా బాయికరా వుపేట గ్రామానికి చెందిన యువతి, కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన యువకుడు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని ఓ ఇంజనీరింగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్న సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. యువతి ప్రస్తుతం బాయికరావుపేటలోనే వలంటీర్‌గా పని చేస్తుండగా.. యువకుడు మాత్రం నాగాలాండ్‌లో సివిల్‌ ఇంజనీర్‌ చేస్తున్నాడు. ఏడాదిగా వీరి ప్రేమాయణం సాగింది. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం యువతిని ఆదోనికి పిలిపించి పెళ్లి చేస్తామని యువకుడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంతలోనే గుట్టుచప్పుడు కాకుండా ఆ యువకుడికి మరో యువతితో సోమవారం పెళ్లి చేశారు. విషయం తెలుసుకున్న బాధిత యువతి మంగళవారం ఆదోని వచ్చింది. ప్రియుడి ఇంటికి వెళ్లి నిలదీయగా యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో బాధితురాలు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు పంచాయితీ పేరుతో రాజీ చేసే ప్రయత్నం చేయగా బాధిత యువతి అందుకు ఒప్పుకోనట్టు తెలిసింది. 

Updated Date - 2021-06-23T05:10:00+05:30 IST