అనగనగా ఒక రాజు’.. బైక్ అమ్మేసి ‘రథం’ కొన్నాడు!

ABN , First Publish Date - 2021-12-19T05:32:56+05:30 IST

పెరిగిన పెట్రోలు ధరలు సామాన్యులకే కాదు..

అనగనగా ఒక రాజు’.. బైక్ అమ్మేసి ‘రథం’ కొన్నాడు!

పెరిగిన పెట్రోలు ధరలు సామాన్యులకే కాదు.. ‘రాజు’లకు కూడా భారంగా మారాయి. మద్దికెరకు చెందిన చిన్ననగిరి యాదవరాజులు జిల్లాకు సుపరిచితులు. రాజ్యం లేకపోయినా, వారసత్వంగా స్థానికులు, ప్రభుత్వం నుంచి రాజగౌరవం మాత్రం నేటికీ అందుతోంది. ఉపాధి కోసం వ్యవసాయం సహా వివిధ రకాల పనులను ఎంచుకున్నారు. యాదవరాజ వంశానికి చెందిన జమేదార్‌ రాజు అనే యువకుడు గ్రానైట్‌ బండ పరుపు పనులు చేస్తుంటాడు. వచ్చే ఆదాయంతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. చుట్టు పక్కల గ్రామాల్లో పని కుదిరితే బైక్‌పై వెళ్లి పని చేసి వచ్చేవాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెరిగిన పెట్రోలు ధరల కారణంగా బైకు మీద వెళితే గిట్టుబాటు కావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయం ఆలోచించాడు. రాజ వంశీకులు కావడంతో గుర్రపు స్వారీలో అనుభవం ఉంది. తన బైక్‌ను బంధువులకు రూ.30 వేలకు అమ్మేశాడు. ఆ సొమ్ముతో గుర్రాన్ని కొన్నాడు.


ఇద్దరు ముగ్గురు ప్రయాణించేందుకు వీలుగా రూ.12 వేలు ఖర్చు పెట్టి టాంగా తయారు చేయించాడు. రాజ్యం లేకుంటేనేం.. రథం సిద్ధమైంది. పెట్రోలు భయం లేదు. ఏ ఊరికైనా టాంగాపై దర్జాగా వెళుతున్నాడు. మద్దికెర చుట్టుపక్కల యడవలి, పెరవలి, ఎం.అగ్రహారం, హంప తదితర 20 గ్రామాలకు టాంగాపైనే ఒకరిద్దని వెంటబెట్టుకుని మరీ పనులకు పోతున్నాడు. ఈ ‘రాజు’గారి ఐడియా ప్రజలకు కూడా నచ్చింది. మద్దికెరకు చెందిన నాగేంద్ర, పెద్దనగిరికి చెందిన యుద్దండ రాయుడులు కూడా గుర్రాలను కొని, టాంగాలను సిద్ధం చేయించుకుని వాడుతున్నారు. ‘పెట్రోలు ఖర్చు రోజుకు కనీసం రూ.150 వచ్చేది. గుర్రానికి రూ.50 మేత కొంటే చాలు. నాతోపాటు మరో ఇద్దరిని తీసుకువెళ్లొచ్చు. ఖర్చు తగ్గింది, ప్రయాణం సులభమైంది..’ అంటున్నాడు జమేదార్‌ రాజు. ఆటోవాలాలు ఇంధనం ధరలు తగ్గించాలని ఆందోళన చేస్తున్నారు. ఎలాగూ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఆటోలను అమ్మేసి.. జట్కా పద్ధతిలోకి వెళ్లడం మేలేమో..! కాలుష్యం తగ్గుతుంది. గడిచిన కాలం మళ్లీ వెనక్కు వచ్చినట్లుంటుంది. ఏమంటారు..? - మద్దికెర, కర్నూలు జిల్లా.

Updated Date - 2021-12-19T05:32:56+05:30 IST